Aadhar Card Update : కేంద్రం ప్రభుత్వం.. ఆధార్ నిబంధనలను సవరించింది. ఆధార్ పొందిన 10 సంవత్సరాలు తర్వాత కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు అయినవాళ్లు గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించి అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే.. ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. గతేడాది 16 కోట్ల మంది ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకున్నారు. దేశంలో ఆధార్ కలిగి ఉన్నవారు 134 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఇంకా అప్డేట్ చేసుకోవాల్సి ఉందన్న విషయంపై స్పష్టత లేదు.
"పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేయని వారు.. డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నాం. గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత రుసుము చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. 'మై ఆధార్' పోర్టల్ లేదా దగ్గర్లోని ఆధార్ కేంద్రం నుంచి ఈ పని పూర్తి చేయవచ్చు."
-కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ