కరోనా మహమ్మారి పోరులో భాగంగా టీకా పంపిణీలో భారత్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. సోమవారం నాటికి మొత్తం 3,17,71,661 వ్యాక్సిన్ డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అందులో 74,08,521 మంది తొలి డోసు, 43,97,613 రెండో డోసు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు(హెచ్ఎస్డబ్ల్యూ) ఉన్నారు. వారితో పాటు 74,26,479 మంది తొలి డోసు, 13,23,527 రెండో డోసు వేయించుకున్న ఫ్రంట్లైన్ వర్కర్స్(ఎఫ్ఎల్డబ్ల్యూ) ఉన్నారు. వారు కాక 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్న 16,96,497 మంది, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 95,19,024 మంది టీకా తీసుకున్నవారిలో ఉన్నారు.
సోమవారం ఒక్కరోజు రాత్రి 7 గంటల వరకు 18,63,623 టీకా డోసులు అందించారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సిబ్బందికి టీకా అందించారు. మార్చి 1 నుంచి.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.
అందుకే పెరుగుతున్నాయి..
కొవిడ్ ఆంక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కేసుల పెరుగుదలకు కారణమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే 80 శాతానికి పైగా వైరస్ కేసులు నమోదైనట్లు చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పార్లమెంట్ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
ఇదీ చూడండి:మాస్కు ధరించలేదని మహిళపై అరెస్టు వారెంట్