ఝార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న లేడీ టీచర్‌తో ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆ హెడ్ మాస్టర్ మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి ఊరేగించారు.
ఇదీ జరిగింది..
పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా మనోహర్‌పుర్ పరిధిలోని బాచ్‌మగుతు ఉన్నత పాఠశాలలో రమేశ్చంద్ర మహతో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో పని చేస్తున్న ఓ మహిళా టీచర్‌ను.. ఆమె నియామకం చట్టవిరుద్ధమని వేధించేవాడని గ్రామస్థులు తెలిపారు. శారీరకంగానూ వేధింపులు తప్పవని తనను బెదిరించేవాడని సదరు ఉపాధ్యాయురాలు ఆరోపించింది.
రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్..
2003లో ఓ ఉపాధ్యాయురాలిగా నియామకమైన ఆ మహిళకు 2005లో పదోన్నతి లభించింది. అయితే 2020లో ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా నియమితుడైన రమేశ్ చంద్ర.. తన ఉద్యోగ నియామకం చెల్లదంటూ వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీనిపై పాఠశాలలోనే అనేకసార్లు వాదనలు జరిగినట్లు తెలిపింది. అపాయింట్‌మెంట్ సర్టిఫికెట్ కూడా అతని వద్దే ఉంచుకొని రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వాపోయింది.
"నా నియామకం సరైనది కాదని రమేశ్ చంద్ర మహతో పదేపదే అంటుండేవాడు. అంతేగాక బెదిరించేవాడు. చిత్రహింసలకు గురిచేసేవాడు. శారీరకంగా వేధించేవాడు. లైంగిక హింసను వ్యతిరేకించినందుకు గొడవ కూడా జరిగింది."
-బాధిత ఉపాధ్యాయురాలు