బంగాల్లో అధికార టీఎంసీ, భాజపా మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందునుంచే మాటలయుద్ధం మొదలుపెట్టిన ఇరుపార్టీలు నాలుగుదశల ఎన్నికలు ముగియటంతో.. విమర్శలదాడి మరింత పెంచాయి. 'నువ్వు ఒకటంటే నేను రెండంటా' అనే విధంగా ఆయా పార్టీల నేతల వైఖరి కనిపిస్తోంది. ప్రతి అంశంలో ప్రత్యర్థిని ఇరుకునపెట్టే వ్యూహంతో ప్రచారం నిర్వహిస్తున్న ఇరు పార్టీలు.. నాల్గోదశ పోలింగ్ సందర్భంగా జరిగిన కూచ్ బెహార్ కాల్పుల ఘటనను.. అనుకూలంగా మార్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ఓటమి భయంతోనే అధికార టీఎంసీ గూండాలు భద్రతాదళాలపై దాడులకు తెగబడుతున్నారని కమలనాథులు ఆరోపించారు . కేంద్ర బలగాల అండతో బంగాల్‌లో అధికారంపీఠం కైవసానికి భాజపాకుట్ర చేస్తోందని సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు.
'భద్రతా సిబ్బందిపై టీఎంసీ గూండాల దాడి'
ఐదో విడత ఎన్నికల్లో భాగంగా సిలిగురిలో ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. కూచ్ బెహార్ ఘటనను ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడడం ద్వారా..బంగాల్లో భాజపా విజయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. కూచ్ బెహార్ కాల్పుల ఘటనపై ప్రధాని విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తొలి నాలుగు దశల పోలింగ్‌లో ఓటర్లు భాజపాకు అనుకూలంగా నిలిచారని, తమ పార్టీ మెజార్టీ సాధించటం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. ఓటమి తప్పదన్న భయంతోనే అధికార టీఎంసీ గూండాలు భద్రతాసిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. దాడులకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ కోరారు.