భారత సైన్యంలో కీలక విభాగమైన ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి చరిత్రలో తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులు నియమితులయ్యారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో శిక్షణను విజయవంతంగా ముగించుకుని ఐదుగురు వనితలు ఆర్మీలో చేరారు. వారిలో ముగ్గురు ఉత్తర సరిహద్దులకు.. మరో ఇద్దరు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లనున్నారు. శనివారం చెన్నైలో జరిగిన కమిషన్ వేడుకలో యువ మహిళా క్యాడెట్లు రాజ్యాంగ విధేయతతో ప్రమాణం చేసి వారి ర్యాంక్ చిహ్నాలను స్వీకరించారు. ఐదుగురు మహిళలతో పాటు మరో 19 మంది పురుషులు కూడా రెజిమెంట్‌లోకి చేరారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ అదోష్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వీరిలో లెఫ్టినెంట్ మెహక్ సైనీ SATA రెజిమెంట్‌లో నియమితులయ్యారు. లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్ ఫీల్డ్ రెజిమెంట్‌లుగా.. లెఫ్టినెంట్ పయస్ ముద్గిల్ మీడియం రెజిమెంట్‌గా, లెఫ్టినెంట్ ఆకాంక్ష రాకెట్ రెజిమెంట్‌గా చేరారు. భారత సైన్యంలో ఆర్టిలరీ రెజిమెంట్ అనేది కీలకమైన రెండో అతిపెద్ద విభాగం. క్షిపణులు, తుపాకులు, మోర్టార్‌లు, రాకెట్ లాంచర్లు, మానవరహిత వైమానిక వాహనాలతో ఆర్టిలరీ మందుగుండు సామగ్రి అక్కడ ఉంటాయి.
ఆర్టిలరీ రెజిమెంట్‌కు మహిళా అధికారులను నియమించడం భారత సైన్యం ప్రగతిశీల అభివృద్ధికి నిదర్శనం. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జనవరిలో మహిళా అధికారులను ఆర్టిలరీ యూనిట్లలోకి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.