HOUSES DEMOLITION AT IPPATAM: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ కూల్చివేతల పర్వం ప్రారంభమైంది. ఇంటి ప్లాన్లను అతి క్రమించి గోడలు నిర్మించారని అధికారులు వాటి కూల్చివేతలను చేపట్టారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగర పాలకసంస్థ అధికారులు రెండు జెసీబీల సహకారంతో కూలగొట్టారు. ప్రహరీ గోడలను కూల్చివేతలను అడ్డుకుంటూ స్థానికులు, గ్రామస్థులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ వారి నిరసనలను పట్టించుకోని అధికారులు కూల్చివేతలు కొనసాగించారు.
జనసేన నాయకుడు నరసింహారావు ఇంటి ప్రహరీ అధికారులు కూల్చివేయగా అతను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ నరసింహారావు కుటుంబ సభ్యులు నిలదీశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీసులను భారీగా మొహరించారు. గ్రామ సరిహద్దులలో పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే లోపలికి రావడానికి అనుమతులు ఇస్తున్నారు.
అసలేం జరిగింది: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఉన్న రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తామంటూ.. మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 2022 నవంబర్ 4 శుక్రవారం నాడు 53 ఇళ్లు, ప్రహరీ గోడలను ఇంటి ప్లాన్లను అతిక్రమించి నిర్మించుకున్నారని జేసీబీలతో పడగొట్టారు. దానిని అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను సైతం పక్కకు లాగి మరీ తొలగింపులు చేపట్టారు. అయితే దీనిపై గ్రామస్థులు తీవ్రంగా మండిపడ్డారు. కనీసం పల్లె వెలుగు బస్సులు కూడా రాని తమ గ్రామంలో 120 అడుగుల రోడ్డు వెంటనే నిర్మించటం ఏంటని ప్రశ్నించారు.
తమ గ్రామం పక్కనే ఉన్న వడ్డేశ్వరం, వడ్లమూడి గ్రామాల నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు అత్యంత ఇరుకైన రహదారి ఉందని, దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో ఇప్పటికే 90 అడుగుల మేర రోడ్డు ఉందని, అది భవిష్యత్ అవసరాలకు సరిపోతుందని అంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఇప్పటికే 40లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన మురుగు కాలవ సైతం రోడ్డుకు హద్దుగా ఉందని వివరించారు.
జనసేనకు స్థలం ఇచ్చారనే కక్ష: 2022 మార్చి 14న నిర్వహించిన జనసేన ఆవిర్బావ సభకు ఇప్పటం గ్రామస్థులు తమ పొలాల్ని ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ ఆంక్షలతో బహిరంగ సభకు స్థలం దొరకని క్రమంలో.. ఇప్పటం గ్రామస్థులు ఓ అడుగు ముందుకేశారు. తమ పొలాల్లో సభ నిర్వహించుకునేందుకు అనుమతించారు. ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వం ఏప్రిల్లో గ్రామస్థులకు నోటీసులు జారి చేసింది. దానిపై వారు కోర్టుని ఆశ్రయించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్న సమయంలోనే ఇళ్లు, ప్రహరీలు కూల్చివేశారు. ఇప్పటంలో సుమారు 600 కుటుంబాలు, దాదాపు 2వేల వరకూ జనాభా నివసిస్తున్నారు.
పవన్ పరిహారం: ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2022 నవంబర్ 27న పార్టీ తరపున పరిహారం అందించారు. అంతకుముందే పవన్ ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణలో దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. స్వయంగా ఇప్పటం వెళ్లి పరిహారం అందించాలని భావించినా పోలీసుల నుంచి అనుమతి మంజూరు కాలేదు. దీంతో బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి పరిహారం అందించారు.
FINE TO IPPATAM VILLAGERS: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో జరిమానా విధించింది. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతపై బాధితులు దాఖలు చేసిన పిటిషన్పై నవంబర్ 24న హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల కూల్చివేతపై ముందస్తు నోటీసులు ఇచ్చారనే నిజాన్ని దాచి.. కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు పొందడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్లు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇళ్ల కూల్చివేతలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ గ్రామస్థులు మళ్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. గ్రామస్థుల రిట్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతల పర్వం.. భారీగా మోహరించిన పోలీసులు ఇవీ చదవండి: