ప్రజలపై దాడిచేసి గాయపరుస్తున్న కోతిని పట్టుకునేందుకు.. అనేక సార్లు ప్రయత్నించి అటవీ అధికారులు విఫలమయ్యారు. ఇలా కోతిని బంధించడం సాధ్యం కాదంటూ ఓ వెరైటీ ఆలోచన చేశారు. మగకోతిని పట్టుకునేందుకు ఓ ఆడకోతిని రంగంలోకి దింపారు. మగ కోతిని ఆడ కోతి ప్రేమలో పడేలా చేశారు. చివరకు అనుకున్నది సాధించారు. కోతిని బంధించడం వల్ల గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని సంగమనేర్ తాలుకాలో ఓ కోతి హల్చల్ చేస్తోంది. సాకుర్ గ్రామంలోని ప్రజలపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. కోతి దాడిలో సుమారు 25 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఇద్దరు చిన్నారులపైన కూడా దాడి చేసింది. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు. రంగంలోకి దిగిన అధికారులు అనేక సార్లు విఫలయత్నాలు చేశారు. గ్రామంలో అనేక చోట్ల బోనులు ఏర్పాటు చేసినా కోతి చిక్కలేదు.