హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఎంపిక దృష్య్టా శిమ్లాలో కాంగ్రెస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కానీ ముఖ్యమంత్రి పేరు మాత్రం ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు రాష్ట్ర నేతలు. ఇక హిమాచల్ సీఎం ఎవరనేది దిల్లీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా తెలుసుకున్నారు. మొత్తం సమాచారాన్ని హెకమాండ్కు చేరవేయనున్నారు. సీఎం రేసులో పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ముకేశ్ అగ్నిహోత్రి పేర్లు ముందంజలో ఉన్నాయి.
అయితే సమావేశానికి ముందుకు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టగలిగే సత్తా తనకు ఉందని వ్యాఖ్యానించారు. దివంగత నేత వీరభద్ర సింగ్ పేరు వల్లే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 40 సీట్లు సాధించిందని ఆమె పేర్కొన్నారు. అలాంటిది ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టడం సరికాదన్నారు. మరోవైపు ప్రతిభా సింగ్ తనయుడు శిమ్లా రూరల్ ఎమ్మెల్యే విక్రమాదిత్యా సింగ్ సైతం ఆయన తల్లికి మద్దతుగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు అంతా కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని ఇదే విషయాన్ని పార్టీ పర్యవేక్షకులు హైకమాండ్‌కు చేరవేస్తారని చెప్పారు.