మహిళలు, చిన్నారులపై దేశంలో జరుగుతున్న అకృత్యాలకు చలించిన ఓ బాలిక ఏకంగా.. ప్రధాన మంత్రికి ఉత్తరం రాసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థినులకు స్వీయ రక్షణలో ఉచిత శిక్షణ ఇప్పించాలని కోరింది.
అసోం గువాహటి నగరంలోని పాండు ప్రాంతానికి చెందిన డాక్టర్ మనోజిత్ కుమార్తె 15 ఏళ్ల 'మీనాక్షి సింగా'. ప్రాగ్జ్యోతిశ్ సీనియర్ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె ఓ వుషూ క్రీడాకారిణి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను చూసి ఆందోళనకు గురైన ఆ బాలిక.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నవంబర్ 18న లేఖ రాసింది.
"సర్. చాలా కాలం నుంచి నేను ఆలోచిస్తున్న దానిని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నందున దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో బాలికలకు స్వీయ రక్షణలో ఉచితంగా శిక్షణ ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలా చేస్తే అమ్మాయిలు ధైర్యంగా ఉండగలుగుతారు. ఆపద సమయాల్లో తమని తాము కాపాడుకోగలుగుతారు. నేనో 'ఉషూ' క్రీడాకారిణిని. మా మాస్టర్ గోపీ సింగ్ సహకారంతో ప్రతి ఆదివారం మా ప్రాంతంలోని అమ్మాయిలకు నేను ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను."