తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియుడి హత్యకు విషపూరిత కుట్ర.. నాగుపాముతో కాట్లు వేయించి.. శవాన్ని కారులో వదిలేసి.. - నైనితాల్​ చర్య

తన ప్రేమికుడిని.. పాముతో కాట్లు వేయించి హత్య చేయించింది ఓ యువతి. అనంతరం మరో స్నేహితుడి సహాయంతో కారులో బాధితుడి మృతదేహాన్ని ఉంచి.. ఏసీ ఆన్​ చేసి పరారైంది. తొలుత అతడు ఊపిరాడక చనిపోయాడని భావించిన పోలీసులు.. అసలు విషయం తెలిసి షాకయ్యారు. ఉత్తరాఖండ్​లో జరిగిందీ ఘటన.

girlfriend got her boyfriend killed by cobra snake with help of a snake charmer in haldwani UTTARAKHAND
girlfriend got her boyfriend killed by cobra snake with help of a snake charmer in haldwani UTTARAKHAND

By

Published : Jul 19, 2023, 8:33 AM IST

ఉత్తరాఖండ్​లోని నైనితాల్​ జిల్లాలో ఓ యువతి.. తన ప్రేమికుడిని చంపేందుకు విషపూరిత కుట్ర పన్నింది. నాగు పాముతో కాట్లు వేయించి హత్య చేయించింది. అనంతరం మరో స్నేహితుడి సహాయంతో.. బాధితుడి మృతదేహాన్ని హైవే పక్కన ఆగి ఉన్న కారులో ఉంచి పరారైంది. అనుమానం రాకుండా ఉండేందుకు ఏసీ ఆన్​ చేసి మరీ వెళ్లిపోయింది.

అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని హల్ద్వానీ నగరంలో జులై 15న హైవే పక్కన ఆగి ఉన్న కారు వెనుక సీట్​లో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అతడిని రాంపుర్​ రోడ్​ నివాసి, ఆటోషోరూం వ్యాపారి అయిన అంకిత్​ చౌహాన్​(32)గా పోలీసులు గుర్తించారు. లాక్​ చేసి ఉన్న కారులో ఏసీ కూడా ఆన్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అంకిత్​ మరణానికి కారులో ఊపిరాడకపోవడమే కారణమని భావించారు. కానీ అంకిత్ రెండు పాదాలకు పాము కాటు వేసిన గుర్తులు ఉండడం వల్ల పోలీసులకు అనుమానం వచ్చింది. అంకిత్ చౌహాన్‌ను విష పాము కాటు వేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కుటుంబసభ్యులు కూడా అంకిత్​ది హత్యేనని ఆరోపించారు. దీంతో బాధితుడి సోదరి ఇషా చౌహాన్​ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇషా చౌహాన్​ పలు కీలక విషయాలు తెలిపింది. జులై 14న తన సోదరుడు అంకిత్​.. తన ప్రేయసి మహి, ఆమె స్నేహితుడు దీప్​ కంద్​పాల్​ను కలవడానికి వెళ్లాడని చెప్పింది. ఆ తర్వాత అతడు ఇంటికి రాలేదని పేర్కొంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు.. పలు కోణాల్లో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

"అంకిత్​ హత్యకు మహి, ఆమె స్నేహితుడు దీప్‌ కంద్‌పాల్‌ కుట్ర పన్నారు. మహి.. అంకిత్‌ను తన ఇంటికి పిలిచింది. పాములు పట్టేవాడితో మాట్లాడి.. నాగుపాముతో కాట్లు వేయించింది. వెంటనే అంకిత్ స్పృహతప్పి పడిపోయాడు. జులై 14వ తేదీ రాత్రి అంకిత్‌ను గోలా బైపాస్‌లో రోడ్డు పక్కన పార్క్ చేసిన అంకిత్​ కారులోనే అతడి మృతదేహాన్ని ఉంచేశారు. హత్య అని తెలియకుండా ఏసీ ఆన్​ చేసి లాక్ వేశారు."
-పోలీసులు

పాములు పట్టేవాడిని రామ్​నాథ్​గా గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మహి ఇంటి పనిమనుషుల హస్తం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహి, దీప్ కంద్‌పాల్ పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. మహి, దీప్ కంద్‌పాల్ మధ్య కొద్దిరోజులుగా సాన్నిహిత్యం పెరుగుతోందని, అంకిత్ వారి మధ్యకు వస్తున్నాడని.. అందుకే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

వైద్యుడి ఇంట్లో చోరీ చేసి.. బాలిక హాత్య..
ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో ఓ వైద్యుడి ఇంట్లో పట్టపగలే దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.25 లక్షలను చోరీ చేసి.. వైద్యుడి కుమార్తెను హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాలోని పురానా సుతియానా ప్రాంతంలో ఉన్న సరస్వతి ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన జరిగింది. మేరఠ్​కు చెందిన డాక్టర్ సుదర్శన్ బైరాగి తన కుటుంబంతో సెక్టార్-147లో నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం సుదర్శన్ తన 14 ఏళ్ల కుమార్తెను ఇంట్లో ఉంచి.. తన భార్యతో క్లినిక్​కు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి కుమార్తె రక్తపు మడుగులో పడి ఉంది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను స్థానికంగా ఫెలిక్స్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ.25 లక్షలు కూడా పోయినట్లు సుదర్శన్​ గుర్తించారు. వెంటనే వైద్యుడు.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details