Girl Burnt Alive In Chennai :తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళా ఐటీ ఉద్యోగిని గొలుసులతో బంధించి సజీవ దహనం చేశాడు ఓ ట్రాన్స్‌జెండర్. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మృతురాలి చిన్ననాటి స్నేహితుడేనని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
చిన్నప్పుడు మృతురాలు నందిని, మహేశ్వరి (వెట్రిమారన్) ఒకే స్కూల్లో చదువుకున్నారు. మహేశ్వరి వయసు పెరుగుతున్నకొద్దీ ఆమెలో మగలక్షణాలు బయటపడ్డాయి. ఆమెలో వచ్చిన మార్పుల్ని గ్రహించి మగాడిలా మారింది. మహేశ్వరిగా ఉన్న తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. అప్పుడు వెట్రిమారన్‌ను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేశారు. స్నేహితురాలు నందిని అన్నీతానై అతడిని చూసుకుంది. సొంత కుటుంబ సభ్యురాలిలా భావించి వెట్రిమారన్‌కు అండగా నిలిచింది. నందిని చనువును ప్రేమ అనుకున్నాడు వెట్రిమారన్. అప్పటి నుంచి నందినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఆమె కూడా తనను ప్రేమిస్తుందని అనుకున్నాడు.
అప్పటి నుంచి వేరే వ్యక్తితో నందిని మాట్లాడినా, చనువుగా ఉన్నా వెట్రిమారన్ సహించలేకపోయేవాడు. వేరే వాళ్లతో చనువుగా ఉండొద్దని నందినిని బలవంతం చేసేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె వెట్రిమారన్‌ను కొన్నాళ్ల క్రితం దూరం పెట్టింది. ఈ క్రమంలో నందినిపై పగ పెంచుకున్నాడు వెట్రిమారన్. డిసెంబరు 23న నందిని పుట్టినరోజు కావడం వల్ల ఆమెతో స్నేహపూర్వకంగా మెలిగాడు వెట్రిమారన్. బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి రోజంతా చెన్నైలోని దేవాలయాలు, అనాథ శరణాలయాలకు తిప్పాడు. సాయంత్రం కాగానే నందినిని కేలంబాక్కంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు బలవంతంగా కళ్లకు గంతలు కట్టేశాడు. అక్కడితో ఆగకుండా కాళ్లు, చేతులను కట్టేసి కత్తితో నరికాడు. అనంతరం పెట్రోల్ పోసి నందినికి నిప్పంటించాడు. అప్పుడు ఆమె అరవడం వల్ల స్థానికులు వచ్చారు. మంటల్లో కాలిపోతున్న నందినిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.