Earthquake In Delhi : దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తరాదిలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.4 గా నమోదైంది. జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్కు 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. 6 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని సమాచారం. మధ్యాహ్నం 1.33 గంటల సమయంలో డోడ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం అధికారులు వెల్లడించారు. దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఛండీగఢ్ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగెత్తారు. శ్రీనగర్‌లో స్కూల్లోని పిల్లలు, దుకాణాల్లో ప్రజలు భయంతో బయటకు పరిగెత్తారని స్థానికులు తెలిపారు. డోడా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సీలింగ్ కూలిపోయింది. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
పాక్‌లో ఇళ్ల నుంచి బయటకు పరుగులు
Earthquake In Pakistan : భారత్‌తోపాటు అటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూమి కంపించినట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ చెప్పింది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఇది సంభవించిందని.. తూర్పు కశ్మీర్‌లో 10కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్‌లో భూకంప తీవ్రత కనిపించింది. భూకంప ప్రభావంతో ఇస్లామాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని తెలిపింది.
పాకిస్థాన్‌లో స్వల్ప భూ ప్రకంపనలు తరచుగా సంభవిస్తుంటాయి. 2005లో సంభవించిన భారీ భూకంపం దాటికి మాత్రం 74వేల మంది ప్రాణాలు కోల్పోయారు.