కరోనా వైరస్ మహమ్మారి విజృంభణకు మహారాష్ట్ర విలవిలలాడుతోంది. నిత్యం కొత్తగా అక్కడ 60వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ వైరస్ ఉద్ధృతికి 'డబుల్ మ్యుటేషన్' కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నమూనాలను విశ్లేషించగా వాటిలో 61శాతం శాంపిళ్లలో డబుల్ మ్యుటేషన్ బయటపడినట్లు వైరాలజీ నిపుణులు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి ఈ డబుల్ మ్యుటేషన్ కారణమని చెప్పలేమన్నారు.
దేశంలో కరోనా వైరస్ ప్రవర్తనను అంచనా వేసేందుకు పాజిటివ్ వచ్చిన రోగుల నమూనాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో జనవరి-మార్చి మధ్య కాలంలో 361 కరోనా శాంపిళ్లను పుణెలోని జాతీయ వైరాలజీ కేంద్రంలో విశ్లేషించారు. వాటిలో 61శాతం కేసుల్లో డబుల్ మ్యుటేషన్లు బయటపడినట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మహారాష్ట్రలో నిత్యం 2లక్షల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారని.. వాటిలో చిన్న మొత్తంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టామని నిపుణులు వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి డబుల్ మ్యుటేషన్ కారమణమని ఈ ఫలితాల ద్వారా పేర్కొనలేమని వైరాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించిన నమూనాల ఫలితాలను ల్యాబొరేటరీలు వెల్లడించడం లేదని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైరస్ పరివర్తనాలను తెలుసుకోవడం ఇబ్బందిగా మారిందని బీఎంసీ అదనపు కమిషనర్ సురేష్ కాకానీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ వైరస్ రకం ఎంత ప్రభావవంతమైనదో తెలిస్తే ప్రజలను కూడా అప్రమత్తం చేసే వీలుంటుందన్నారు.
శాంపిళ్ల సేకరణపై ఆందోళన..