22 ఏళ్ల యువకుడి శరీరంలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందినట్లు గుర్తించారు వైద్యులు. ఈ అరుదైన ఘటన ఝార్ఖండ్ గొడ్డాలో జరిగింది. యువకుడి శరీరంలో గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్ నాళాలు వృద్ధి చెందినట్లు వైద్యులు తెలిపారు. పురుషుల్లో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్న ఘటన అత్యంత అరుదుగా జరుగుతుందని పేర్కొన్నారు.
యువకుడిలో స్త్రీ అవయవాలు.. కడుపులో గర్భాశయం, అండాశయం.. అర్ధనారీశ్వరుడు అంటూ..
ఓ యువకుడిలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలను గుర్తించారు వైద్యులు. ఈ అవయవాలను ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ ఘటన ఝార్ఖండ్లో జరిగింది.
కొద్దిరోజుల క్రితం యువకుడికి కడుపులో నొప్పి వచ్చింది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి.. హెర్నియా ఉన్నట్లు గుర్తించారు. పురుషాంగం వద్ద హెర్నియా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుడివైపు వృషణం సైతం లేదని గుర్తించారు. చివరకు.. హెర్నియాను తొలగించేందుకు ఆపరేషన్ చేయాలని యువకుడికి తెలిపారు వైద్యులు. అందుకు యువకుడు అంగీకరించాడు. అయితే శస్త్రచికిత్స చేస్తుండగా యువకుడి కడుపులో గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్ నాళాలు ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ చేసి శరీరంలోని స్త్రీ పునరుత్పత్తి అవయాలను తొలగించారు.
"వైద్య పరిభాషలో ఇలా పురుషుల్లో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు అభివద్ధి చెందడాన్నిపెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్(పీఎండీఎస్) అంటారు. ఈ సిండ్రోమ్ వల్ల స్త్రీ, పురుష అంతర్గత అవయాలు ఒకే వ్యక్తిలో వృద్ధి చెందుతాయి. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. యువకుడి వివరాలు గోప్యంగా ఉంచాం. ఇలాంటివారిని ప్రజలు అర్ధనారీశ్వరుడిగా పిలుస్తారు."
-తారా శంకర్, వైద్యుడు