తాను పెంచుకున్న దూడను భగవంతుడికి బహుకరించాలని ఓ భక్తుడు 360 కిలోమీటర్లు నడిచాడు. 36 రోజుల అనంతరం దూడతో పాటు దేవుడి సన్నిధికి చేరుకుని కోరికను నెరవేర్చుకున్నాడు. ఒకపక్క తన ఉద్యోగం చేస్తూనే దూడతో కలిసి నడక కొనసాగించాడు. కర్ణాటక చిక్కమగళూరు జిల్లా కలసలోని హిరేబైలుకు చెందిన శ్రేయాన్ష్ జైన్, ఎస్డీఎమ్ ఇన్స్టిటూషన్లో చదువు పూర్తి చేశాడు. అనంతరం ఓ సంస్థలో ఉద్యోగానికి కుదిరాడు. అయితే కరోనా కష్టకాలంలో అందరూ ఇబ్బంది పడినట్లుగానే శ్రేయాన్ష్ సైతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. మహమ్మారి దాటికి కుంగిపోకుండా డైయిరీ వ్యాపారం ప్రారంభించాడు.
ఆ సమయంలో శ్రేయాన్స్ ఓ స్వదేశీ గిర్ జాతికి చెందిన ఆవును పెంచుకున్నాడు. ఆ ఆవుకు మొదటి సంతానంగా పుట్టిన దూడను ధర్మస్థల మంజునాథ స్వామి ఇవ్వాలనుకున్నాడు. అనంతరం దూడను తీసుకొని జిగాని ప్రాంతం నుంచి కాలినడక ప్రారంభించాడు. ఆ దూడను ముద్దుగా భీష్మ అని పిలుచుకునేవాడు శ్రేయాన్స్.