నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని మరోమారు కేంద్రాన్ని కోరారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశ రాజధాని సరిహద్దుల్లో.. రైతులు తమ మనుగడ కోసం పోరాడుతున్నారని అన్నారు. దిల్లీలో రైతులు నిరసన చేస్తున్న సింఘు ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్.
రైతులతో కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా చర్చ జరపాలని నేను సవాలు చేస్తున్నా. అప్పుడు చట్టాలపై రైతులకు అవగాహన లేదంటున్న కేంద్రానికి కనువిప్పు కలుగుతుంది. సాగు చట్టాల వల్ల ఎలాంటి హాని జరగదని కేంద్రం చెబుతోంది. రైతుల భూములు ఎవరూ తీసుకోరని, మద్దతు ధర అలాగే ఉంటుందని అంటోంది. కానీ ఈ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడట్లేదు. చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా.. దయచేసి సాగు చట్టాలను రద్దు చేయండి.
--కేజ్రీవాల్ , దిల్లీ సీఎం
రైతుల కోసం..మరో ప్రాణ త్యాగం..
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల కష్టాలను చూడలేక మరొకరు ప్రాణ త్యాగం చేశారు. నిరసనలు కొనసాగుతున్న దిల్లీలోని టిక్రీ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో అమర్‌జిత్ సింగ్ అనే న్యాయవాది విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషం సేవించిన ఆయనను హరియాణాలోని రోహ్‌తక్‌లో ఉన్న పీజీఐఎమ్ఎస్ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా తాను ప్రాణ త్యాగం చేస్తున్నట్లు ఆత్మహత్య లేఖలో రాసిన న్యాయవాది.. తద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వం ఆలకిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాల వల్ల మోసపోయామని రైతులు, కూలీలు వంటి సామాన్యులు భావిస్తున్నరని ఇందులో పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా ఇప్పటికే ఓ సిక్కు మతప్రభోదకుడు, మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.