దిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన మాజీ సీబీఐ అధికారి రాకేశ్ ఆస్తానా తమకు వద్దంటూ ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం.. దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆస్తానా పదవీ విరమణకు కేవలం మూడు రోజుల ముందే దిల్లీ పోలీస్ బాస్‌గా కేంద్రం నియమించడం సుప్రీం ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 31న రాకేశ్ ఆస్తానా పదవీకాలం ముగియనున్న సందర్భంలో దిల్లీ పోలీస్ కమిషనర్‌గా కేంద్రం నియమించడం మరోసారి చర్చకు దారితీసింది.
'సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రాకేశ్ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం నియమించిందని భావిస్తున్నాం. అంతేకాకుండా సుప్రీం ఆదేశాలను పాటించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. అందుకు అనుగుణంగానే నియామకాలు జరగాలి' అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సీబీఐ చీఫ్‌గా అనర్హుడైన వ్యక్తి, దిల్లీ పోలీస్ కమిషనర్‌గా కూడా అనర్హుడేనని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా డీజీ స్థాయి పోస్టులో నియామకం జరగాలంటే కనీసం ఆరు నెలల పదవీకాలం ఉండాలని.. కానీ, ఆస్తానాకు కేవలం నాలుగు రోజులే ఉందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ గుర్తుచేశారు. అటువంటప్పుడు రాకేశ్ ఆస్తానాను కేంద్రం ఏవిధంగా నియమిస్తుందని ప్రశ్నించారు.