Delhi Aiims Fire Accident : దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు 13 ఫైర్ ఇంజిన్లతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
సోమవారం ఉదయం 11.54 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. ఎమర్జెన్సీ వార్డు పైన ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. రోగులందరినీ ప్రమాద వార్డు నుంచి సురక్షితంగా తరలించిన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని తెలిపిన అధికారులు.. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు వివరించారు. మంటలను ఆర్పేందుకు ఆసుపత్రి వాటర్ ట్యాంక్ నీటిని కూడా వినియోగించినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలయాల్సి ఉంది.
ఎయిమ్స్ కన్వర్జెన్స్ బ్లాక్‌లో మంటలు..
Fire incident in Delhi Aiims : కొంత కాలం క్రితం కూడా ఇదే దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కన్వర్జెన్స్ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని మొత్తం 22 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చాయి.