CWC Meeting Delhi Kharge Today : ఎంపీలను రక్షించే బాధ్యతల్లో ఉన్నవారే రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. పార్లమెంట్ ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌పై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. దిల్లీలో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా, ఓటు షేర్ పెరగడం లాంటివి కొన్ని సానుకూలంగా జరిగాయని తెలిపారు.
"ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఎలా ధ్వంసం చేస్తుందో దేశం మొత్తం చూస్తోంది. కీలకమైన బిల్లులను ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదించుకుంటోంది. పార్లమెంట్‌ను అధికార పార్టీ వేదికగా మార్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. రాజ్యాంగ పదవులు పొందిన వారు కుల, ప్రాంత రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. వాటిని విశ్లేషించుకుంటాం. మళ్లీ అవి జరగకుండా చూసుకుంటాం. లోక్‌సభ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కార్యకర్తలు, నేతలందరూ కార్యాచరణ ప్రారంభించాలి. రాహుల్ గాంధీ మరో విడత భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పశ్చిమానికి చేయాలని అనేక మంది నేతలు కోరారు. దీనిపై అంతిమ నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉంది."
--మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
సీట్ల సర్దుబాటపై ఐదుగురు సభ్యులతో కమిటీ
సీట్ల సర్దుబాటుపై వెంటనే చర్చలు ప్రారంభించాలని విపక్ష కూటమి ఇండియా నాలుగో సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ఇందుకోసం కాంగ్రెస్ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లోని పార్టీలను కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తుందని వివరించారు.