మానవత్వానికి పొంచి ఉన్న అత్యంత ప్రమాదకరమైన అంశాల్లో తీవ్రవాదం ఒకటిని విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదాన్ని ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహక వ్యాపారంగా మార్చుకున్న దేశాలపై ఐక్యరాజ్యసమితి తీవ్రవాద వ్యతిరేక విభాగం ఆంక్షలు ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపారు. దిల్లీలో జరుగుతున్న ఐరాస భద్రతా మండలి.. తీవ్రవాద వ్యతిరేక కమిటీ సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు.
పాకిస్థాన్‌పై పరోక్ష విమర్శలు గుప్పించిన జైశంకర్.. ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో తీవ్రవాదం పెరుగుతూ, విస్తరిస్తూ ఉందన్నారు. సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు తీవ్రవాద ముఠాలకు పనిముట్లుగా మారాయని జైశంకర్ చెప్పారు. ఉదారవాద విధానాలను పాటిస్తున్న సమాజాల స్వేచ్ఛ, సమతౌల్యం, ప్రగతిపై సాంకేతికతను ఉపయోగించి దాడులు చేస్తున్నారని కేంద్రమంత్రి వివరించారు. ముష్కర మూకలు, వ్యవస్థీకృత నేర ముఠాలు ఉపయోగిస్తున్న డ్రోన్లు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు అదనపు ఆందోళన కలిగిస్తున్నాయని జైశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు.