Cough Syrup Deaths : భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌పై మరోసారి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడి ఫార్మా కంపెనీలో తయారైన దగ్గుమందు తాగిన 21 మంది పిల్లల్లో 18 మంది మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ కంపెనీ ఈ మందు తయారు చేసింది. కాగా, ఆ ఆరోపణలపై భారత ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. నమూనాలు పరీక్షించే వరకు నొయిడా యూనిట్‌లో తయారీని నిలిపివేసింది.
ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ స్పందించారు. నొయిడాలోని ఫార్మాస్యూటికల్ కంపెనీలో యూపీ డ్రగ్ కంట్రోల్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ బృందం సంయుక్త తనిఖీలు చేపట్టిందని తెలిపారు. దగ్గు సిరప్ నమూనాలను చండీగఢ్‌లోని ప్రాంతీయ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. అయితే 'డాక్-1 మ్యాక్స్' దగ్గు మందును భారత్‌లో విక్రయించడం లేదని.. ఉజ్బెకిస్థాన్‌కు ఎగుమతి మాత్రమే జరిగిందని ఓ అధికారి తెలిపారు.
వైద్యులు సూచన లేకుండా..
మరియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన 'డాక్-1 మాక్స్' సిరప్ తాగిన పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్లు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. కాగా, వైద్యుల సూచన లేకుండా ఎక్కువ మోతాదులో ఈ దగ్గు మందును తాగడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ 2012లో ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టరు చేయించుకుంది.