కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దాదాపు గత ఏడాదికాలంగా ఆందోళన చేస్తున్న రైతులు.. సెప్టెంబరు27న 'భారత్ బంద్'(Bharat bandh) పాటించాలని ఇచ్చిన పిలుపునకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. రైతు సంఘాలు నిర్వహించే శాంతియుత బంద్‌కు(farmers agitation bandh) కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలుస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చల ప్రక్రియ పునఃప్రారంభించి, మద్దతుధరను చట్టబద్ధం చేస్తూ కొత్త సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని తాము కోరుతున్నట్లు తెలిపారు.
2012-13 నాటి రైతుల ఆదాయ పరిస్థితులను 2018-19తో పోల్చితే 48 నుంచి 38 శాతానికి తగ్గాయన్నారు. ఇదే కాలవ్యవధిలో రైతుల సగటు రుణభారం రూ.47 వేల నుంచి రూ.74 వేలకు పెరిగినట్లు వెల్లడించారు. భారత ప్రభుత్వ సర్వే ప్రకారమే.. రైతుల రోజువారీ ఆదాయం రూ.27 మాత్రమే ఉన్నట్లు గౌరవ్ వల్లభ్ తెలిపారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పంటల మద్దతుధరను చట్టబద్ధం చేయాలని లిఖితపూర్వకంగా కోరిన నరేంద్ర మోదీ.. ఇపుడు తన నిర్ణయాన్ని తానే ఆమోదించకపోవడం విడ్డూరమన్నారు. గతేడేళ్లలో వ్యవసాయరంగ పరిస్థితులు దారుణంగా దిగజారినందునే కాంగ్రెస్ పార్టీ రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
భారత్ బంద్‌కు ఆప్ మద్దతు