కరోనా నివారణ వ్యాక్సిన్లలో ఒకటైన కొవిషీల్డ్ సురక్షితమైనదేనని, ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం సృష్టం చేసింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు పడతాయనే ఉద్దేశంతో కొన్ని ఐరోపా దేశాలు దీని వినియోగాన్ని నిలిపివేశాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికార వర్గాలు ఈ భరోసాను ఇచ్చాయి.
ఈ వ్యాక్సిన్ను తీసుకున్నవారికి వారికి రక్తం గడ్డకట్టుకుపోతున్నట్లు కొన్ని దేశాల్లో అనుమానిస్తున్నా అలాంటి ముప్పు ఏమీ ఉండదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్.. బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వాడుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు యూకే, బ్రెజిల్ రకాల వైరస్పైనా సమర్థంగా పనిచేస్తాయని, అది శాస్త్రీయ అధ్యయనాల్లో రుజువైందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు.