కేరళలో జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆరుగురు సభ్యులున్న నిపుణుల బృందాన్ని కేరళకు పంపింది.
"ప్రజా ఆరోగ్య నిపుణులు, వ్యాధి నిపుణులు, ఎయిమ్స్‌కు చెందిన వైద్యులు ఉన్న ఆరుగురు సభ్యులున్న బృందం కేరళకు బయలుదేరింది. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిచడం సహా వైరస్ కేసుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి వీరు సహకరించనున్నారు."
-లవ్ ఆగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
జికా వైరస్ తొలి కేసు తిరువనంతపురంలోని పరస్సాలలో నమోదైంది. ఓ 24 ఏళ్ల గర్భిణికి వైద్యులు గురువారం పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఈ వైరస్ సోకినట్లు వెల్లడైంది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డలో వైరస్ లక్షణాలు లేనందున వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.