తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Indian Air Force: వాయుసేనకు 56 రవాణా విమానాలు - ఐఏఎఫ్​ చీఫ్​ ఆర్​కేఎస్​ భదౌరియా

భారత వాయుసేన కోసం 56 సీ-295 ఎండబ్ల్యూ(C 295 MW Aircraft) రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. స్పెయిన్‌ నుంచి 16 రవాణా విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. మిగతా 40 విమానాలను భారత్‌లోనే తయారీ(Make In India) చేయనున్నట్టు ప్రకటించింది. మరోవైపు రానున్న 20 ఏళ్లలో 350 విమానాల సేకరణకు యోచిస్తున్నట్లు భారత వాయుసేన(Indian Air Force) తెలిపింది.

C 295 MW Aircraft
సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాలు

By

Published : Sep 8, 2021, 10:27 PM IST

Updated : Sep 8, 2021, 10:57 PM IST

భారత వాయుసేన కోసం విమానాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 56 సీ-295 ఎండబ్ల్యూ(C 295 MW Aircraft) రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. స్పెయిన్‌ నుంచి 16 రవాణా విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. మిగతా 40 విమానాలను భారత్‌లోనే తయారీ చేయనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో తయారీ(Make In India), స్వదేశీ సామర్థ్యం పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులువేస్తోంది.

మరోవైపు, ఈ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసిన 48 నెలల్లో స్పెయిన్‌ నుంచి విమానాలు పంపిణీ జరగనుంది. మిగతా 40 విమానాలు మాత్రం భారత్‌లో టాటా కన్సార్టియం 10 ఏళ్ల లోపు ఉత్పత్తి చేయనుంది. సైనిక విమానాన్ని భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసే తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. స్వదేశీ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సూట్‌తో రూపొందుతున్న ఈ రవాణా విమానాల తయారీ ఉపాధి కల్పనలో ఓ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్రం తెలిపింది. ఏరోస్పేస్‌ ఎకో సిస్టమ్‌లో ప్రత్యక్షంగా అత్యంత నైపుణ్యం కలిగిన 600 ఉద్యోగాలు, పరోక్షంగా 3వేలకు పైగా ఉద్యోగాలతో పాటు అదనంగా మరో 3వేల ఉద్యోగావకాశాలు కలగనున్నాయి.

350 యుద్ధ విమానాలు..

రానున్న 20 ఏళ్లలో దాదాపు 350 యుద్ధ విమానాల సేకరణకు భారత వాయుసేన(Indian Air Force) యోచిస్తున్నట్లు భారత వైమానిక దళాధిపతి ఆర్​కేఎస్​ భదౌరియా తెలిపారు. భారత అంతరిక్ష రంగంపై దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలను రోజురోజుకూ అధికం చేస్తున్న నేపథ్యంలో భారత ఏరోస్పేస్‌ రంగాన్ని శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం దేశీయ తయారీసంస్థలపై దృష్టిపెడతామన్న భదౌరియా... రాబోయే రెండు దశాబ్దాల్లో తేలికపాటి యుద్ధ విమానాలు సహా 350 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమాకూర్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. భారత్‌ రూపొందించిన తేజస్‌ తేలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌..... దేశీయ ఉత్పత్తి రంగం అభివృద్ధికి ఊతం ఇస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి:అఫ్గాన్​ విషయంలో భారత్​, రష్యా కీలక నిర్ణయం

Last Updated : Sep 8, 2021, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details