కరోనా కారణంగా రద్దయిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలపై విద్యార్థుల అనుమానాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నివృతి చేయనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులతో శుక్రవారం(జూన్ 25) సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నారు. కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిన పోఖ్రియాల్‌కు.. తమ ఆందోళన, సందేహాలు తొలగించమని విద్యార్థులు సందేశాలు పంపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో మాట్లాడనున్నట్లు ఆయన వెల్లడించారు.
"ఇప్పటికే విద్యార్థులు చాలా సందేశాలు పంపారు. అందులో కొంతమంది నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. మరికొంతమంది పరీక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం వల్ల మీతో మాట్లాడలేకపోతున్నా. అయితే సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. ట్విట్టర్, ఫేస్బుక్, మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు" అని పోఖ్రియాల్ వరుస ట్వీట్లు చేశారు.