Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది అధికార భాజపా. ఉచిత విద్య, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలను అందులో పేర్కొంది. భాజపా జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్‌తో పాటు రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ భూపేంద్ర పాటిల్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల వద్ద నుంచి సేకరించిన సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేశామన్నారు. వివిధ జిల్లాల్లో మంత్రులతో పాటు యువమోర్చా ద్వారా పలు కార్యక్రమాల ద్వారా సలహాలు సేకరించినట్లు తెలిపారు. సుమారు 12 వేల సజెషన్ బాక్సులు, మిస్డ్ కాల్స్ పోల్, వెబ్సైట్ పోల్, వాట్సాప్ పోల్ల సమాహారమే ఈ 'సంకల్ప పత్రం' అని నడ్డా పేర్కొన్నారు.
'ట్రిలియన్ డాలర్ ఎకానమీగా గుజరాత్.. ఉమ్మడి పౌరస్మృతి అమలు'.. మేనిఫెస్టోలో భాజపా హామీలు - సంకల్ప్ పత్రా భాజపా
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి సన్నహాలు చేస్తున్న కాషాయదళం శనివారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజల వద్ద నుంచి సేకరించిన సలహాల ద్వారా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు భాజపా తెలిపింది.
BJPs manifesto for Gujarat Assembly polls
మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు
- గుజరాత్ పురోగతి కోసం రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడం. గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు సమానంగా తీర్చిదిద్దడం.
- ప్రజా ఆస్తులకు నష్టం కలిగించేవారి నుంచే పరిహారం వసూలు చేస్తాం. ఇందుకు సంబంధించి చట్టాన్ని అమల్లోకి తెస్తాం. సంఘ విద్రోహకులు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేకూరిస్తే వారిపై చర్యలు తీసుకునేలా చేస్తాం.
- గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలు చేస్తాం.
- ఉగ్రవాదులతో పాటు స్లీపర్ సెల్స్‌ను నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్‌ను స్థాపిస్తాం.
- బాలికలకు కేజీ టు పీజీ ఉచిత విద్య.
- సుమారు 48,00,000 మంది రైతులకు వడ్డీ మాఫీ. 13 లక్షల రైతు కుటుంబాలకు సాగునీరు సరఫరా.
- 21 లక్షల హెక్టార్ల ఆయకట్టును సాగునీటి పథకంలో చేర్చడం.
- 1.85 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకం. 19 కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు.
- రూ.10 వేల కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన.
- సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లో సీ ఫుడ్ పార్కుల ఏర్పాటు
- రూ.10 వేల కోట్లతో 3 సివిల్ ఆర్బిట్రేషన్ల ఏర్పాటు.
- 20 వేల ప్రభుత్వ పాఠశాలలను అద్భుతమైన పాఠశాలలుగా తీర్చిదిద్దడం.
- కార్మికులకు శ్రామిక్ క్రెడిట్ కార్డ్, రూ.2 లక్షల వడ్డీ లేని రుణం, ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఒకేసారి రూ.50,000 విద్య ప్రోత్సాహకం అందజేత.
- ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన కింద ఉచిత వైద్యంతో పాటు ప్రతి కుటుంబానికి వార్షికంగా చికిత్స కోసం 10 లక్షల రూపాయిలు.
- వనబంధు కల్యాణ యోజన 2.0 ద్వారా 56 ప్రాంతాలకు వ్యాన్ల ద్వారా రేషన్ సరఫరా.
- అంబాజీ- ఉమర్గామ్ మధ్య నాలుగు నుంచి ఆరు లైన్ల రహదారి అయిన బిర్సా ముండా ఆదివాసీ సమృద్ధి కారిడార్ నిర్మాణం.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులకు ఉచిత గృహ నిర్మాణ హామీ.
- గిరిజన ప్రాంతాల్లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించేందుకు 8 మెడికల్, 10 పారా మెడికల్ కాలేజీల నిర్మాణం.
- దేశంలోనే తొలిసారిగా 3,000 కి.మీ మేర వృత్తాకార మార్గం నిర్మాణం. మొత్తం గుజరాత్‌ను కవర్ చేసేలా 4-6 లేన్ల పొడవైన 'పరిక్రమ మార్గం' నిర్మాణం.
- గాంధీనగర్, సూరత్ మెట్రో కార్యకలాపాలు నిర్ణీత గడువులోపు పూర్తి. సౌరాష్ట్ర(రాజ్‌కోట్), సెంట్రల్ గుజరాత్ (వడోదర) మొదటి మెట్రో రైలు సర్వీస్ వేగవంతంగా ప్రారంభం.
ఆధ్యాత్మిక హామీలు
- ద్వారకను పశ్చిమ భారతదేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు సంకల్పం. 'దేవభూమి ద్వారకా కారిడార్' ఏర్పాటు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ కృష్ణుడి విగ్రహం, త్రీడీ శ్రీమద్ భగవద్గీత ఎక్స్‌పీరియెన్స్ జోన్‌తో పాటు గ్యాలరీ నిర్మాణం.
- దేవాలయాల పునరుద్ధరణతో పాటు విస్తరణలో భాగంగా సోమనాథ్, అంబాజీ, పావగఢ్ కోసం రూ.1,000 కోట్లు కేటాయింపు. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో గుజరాత్ సాంస్కృతిక వారసత్వ ప్రాముఖ్యతను పెంచడానికి 2,500 కోట్ల రూపాయల పెట్టుబడి.
- పశువుల సంపూర్ణ సంరక్షణను నిర్ధారించడానికి, గోశాలలు మౌలిక సదుపాయాల పరంగా బలోపేతం. అదనంగా 1,000 సంచార పశువైద్య యూనిట్లు నిర్మాణం. ప్రతి పశువులకు టీకాలు వేయడంతో పాటు బీమా సౌకర్యం.
Last Updated : Nov 26, 2022, 2:58 PM IST