కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. 'బీజేపీ ప్రజా ప్రణాళిక' పేరుతో మేనిఫేస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని తెలిపింది. దీనికోసం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి.. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ముందుకువెళ్తామని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కర్ణాటకలోని అన్నివర్గాలకు అందాయని పేర్కొంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చింది. ఉగాది, గణేశ్ చతుర్థి, దీపావళి పండుగలకు ఈ గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్లు తెలిపింది.
పోషణ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రోజూ అరలీటర్ నందినిపాలను ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు నెలవారీ రేషన్ సరుకులతో 5 కిలోల సిరిధాన్యాలు ఇచ్చే పథకాన్ని మేనిఫేస్టోలో చేర్చింది. తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కర్ణాటక అపార్ట్‌మెంట్ యాజమాన్య చట్టం-1972 సవరణలకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని మేనిఫేస్టోలో పేర్కొంది. బెంగళూరులోని అపార్ట్‌మెంట్లలో నివసించే వారి సౌలభ్యం, ఫిర్యాదుల కోసం స్థానికులతో కమిటీ నియమిస్తామని వెల్లడించింది.
బీజేపీ మేనిఫెస్టో ఓ బోగస్ : కాంగ్రెస్
కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోను బోగస్‌గా, 'జూట్లూట్ బీజేపీ మనీఫెస్టో'గా అభివర్ణించింది కాంగ్రెస్. 40 శాతం కమీషన్ బీజేపీ ప్రభుత్వం.. 90 శాతం హామీలను ఇంకా నెరవేర్చలేదని.. ఇంతలోనే మరో బోగస్ మేనిఫెస్టోతో వచ్చారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక ఇంఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి సర్కార్ అని.. ప్రతి పనికి 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఆరోపించారు. రూ. 400 ఉన్న సిలిండర్ ధరను మూడు రెట్లు పెంచి రూ.1,100 చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మూడు ఉచితంగా ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హామీల జోరు
మరోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూనే సంక్షేమం పేరుతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళుతోంది. ఇప్పటికే ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి వంటి 4 హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే 'గృహజ్యోతి' కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకముందే హామీ ఇచ్చారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు 'గృహలక్ష్మి' పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల 2వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 'అన్న భాగ్య యోజన' పేరుతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చింది.
Karnataka Election 2023 : కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కు 76, జేడీఎస్‌కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు స్థానిక పార్టీలు సైతం కర్ణాటక ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ప్రస్తుతమున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలం పార్టీ చూస్తుండగా.. గతంలో కోల్పోయిన అధికారాన్ని ఈ సారి ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే.. కర్ణాటక రాజకీయ చరిత్రను పరిశీలిస్తే 1985 తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలిచింది లేదు. అక్కడ జరిగిన తొలి ఆరు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొందింది. తర్వాత నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇప్పుడు ఈ సంప్రదాయానికి చరమగీతం పాడి చరిత్ర సృష్టించాలని బీజేపీ యోచిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో అధికార పార్టీ.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం మూడు దశాబ్దాలుగా జరుగుతోంది. అక్కడి ఓటర్లు ప్రభుత్వాలను మార్చడం, వేరు వేరు పార్టీలకు ఓటు వేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వారి నాడి పట్టడం అన్ని పార్టీలకు సవాలుగా మారింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి :కర్ణాటకలో 'నోటా' కలవరం.. ఓటర్లు 'జై' కొడితే పార్టీల ఆశలు గల్లంతే!
కర్ణాటక పోరు.. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సగం మంది డిపాజిట్లు లాస్.. ఎందుకిలా?