జపాన్‌లో జరిగే జీ-20 దేశాల సదస్సులో ఉగ్రవాద సమస్యపై కీలకంగా చర్చిస్తామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, ఇతర అంతర్జాతీయ సమస్యలపైనా అన్ని దేశాల భాగస్వామ్యాన్ని కూడగట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. జపాన్‌కు బయలుదేరే ముందు పర్యటనలో చర్చించే అంశాలపై ప్రకటన చేశారు ప్రధాని.
"మహిళా సాధికారత, డిజిటలైజేషన్, కృత్రిమ మేధ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో అంతర్జాతీయ సవాళ్లను ప్రపంచం దృష్టికి తీసుకెళతాం. ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై ప్రముఖంగా చర్చిస్తాం. జీ-20 వేదికలో ఈ అంశాలే భారత ప్రధాన అజెండా."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
బహుళ పాక్షిక సంబంధాల సంస్కరణకు జీ-20 దేశాల సదస్సు చక్కటి వేదికని మోదీ అభిప్రాయపడ్డారు. వేగంగా మారుతోన్న అంతర్జాతీయ సమాజంలో వివిధ దేశాల సహకారం కీలకమని వ్యాఖ్యానించారు.