సవాళ్లు, ప్రతిసవాళ్లతో బంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై భాజపా నేత సువేందు అధికారి దీటుగా స్పందించారు. తన నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో మమతను ఓడిస్తానని అన్నారు. లేదంటే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.
"నందిగ్రామ్ నుంచైనా వేరే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా మమతా బెనర్జీని 50 వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే.. రాజకీయాలను వదిలేస్తా."
-సువేందు అధికారి, భాజపా నేత
ప్రస్తుతం భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత సువేందు అధికారి.. పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన నేపథ్యంలో ఆయన స్థానమైన నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. భవానీపుర్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
సువేందు ర్యాలీపై రాళ్ల దాడి
మరోవైపు, కోల్‌కతాలో భాజపా నిర్వహించిన రోడ్‌షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు భాజపా కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. సువేందుతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ ర్యాలీకి హాజరయ్యారు. నగరంలోని టోలీగంజ్ నుంచి రాష్‌బెహారీ అవెన్యూ వరకు భాజపా కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. చారు మార్కెట్ సమీపానికి వెళ్లగానే పలువురు రాళ్లు విసిరారు.
భాజపా కార్యకర్తలపై రాళ్లు రువ్విన దృశ్యాలు