అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై కాంగ్రెస్ తీరును తప్పుబట్టింది భాజపా. దేశ ఖ్యాతిని ప్రపంచపటంపై గర్వించదగ్గ స్థాయిలో ఉంచుతున్నప్పుడు ఎందుకు అసంతృప్తి చెందుతున్నారని ప్రశ్నించింది. భాజపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నా హృదయపూర్వకమైన సలహా ఏంటంటే... ఏ దేశ చరిత్రలోనైనా చాలా అరుదుగా అవకాశాలు వస్తుంటాయి. అలాంటి సమయంలో దేశంలోని ఐకమత్యాన్ని చాటాలి కానీ విభజన భావాన్ని కాదు. ఈ మట్టి భరతమాత పుట్టినిల్లు. ఈ దేశం కాంగ్రెస్ పార్టీకి చెందినదో.. భాజపాకు చెందినదో కాదు. ఓ భారతీయుడిగా మా పార్టీ ముఖ్య సిద్ధాంతం ఒకటే.. దేశం ముందు, తర్వాత పార్టీ, చివరలో మనం.