కర్ణాటకలో 13 నెలల సంకీర్ణ సర్కారు భవితవ్యం రేపటితో తేలనుంది. ఇప్పటివరకు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది?.. అన్న పతాక స్థాయి ఉత్కంఠకు కాస్త తెరపడినట్లే కనిపిస్తోంది. బలపరీక్షకు ముందు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూటమి నేతలకు ఉన్న కాస్త ఆశలను కూడా ఆవిరి చేసింది.
బలపరీక్షలో పాల్గొనాలని రెబల్ ఎమ్మెల్యేలను బలవంతం చేయరాదని సుప్రీం తేల్చి చెప్పింది. వారిపై కాంగ్రెస్-జేడీఎస్ జారీ చేసిన విప్ పని చేయదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు విధానసభలో ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుంది..?
గురువారం ఉదయం 11 గంటలకు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష జరుగుతుంది. సుప్రీం తీర్పును బట్టి... రెబల్ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావాల్సిన అవసరం లేదు. సభకు రావడంలేదని వారు స్పష్టంగా చెప్పేశారు కూడా. ఫలితంగా... అధికారంలో కొనసాగేందుకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేకుండా పోతుంది. కుమారస్వామి సర్కారు బలపరీక్షలో ఓడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ రెబల్స్ రాజీనామాలను స్పీకర్ ఇప్పటికిప్పుడు ఆమోదించినా అదే పరిస్థితి.
లెక్కల చిక్కులు...
కర్ణాటకలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 224. అధికారంలో కొనసాగేందుకు కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం. సంక్షోభానికి ముందు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలం 118. భాజపా బలం 105.
కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్వతంత్ర సభ్యులు మరో ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా పక్షాన చేరారు.
బలపరీక్షకు ముందు రెండు కీలక పరిణామాలకు అవకాశాలు ఉన్నాయి....
1. రాజీనామాలు ఆమోదిస్తే...
16 మంది రాజీనామా లేఖలు సమర్పించినా... సుప్రీంకోర్టును 15 మంది అసంతృప్తులే ఆశ్రయించారు. ఆ 15 మంది రాజీనామాలను స్పీకర్ బలపరీక్షకు ముందే ఆమోదిస్తే... కర్ణాటక శాసనసభలో సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. ప్రభుత్వం కొనసాగేందుకు కనీసం 105 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ సంఖ్యా బలం కుమారస్వామి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే అవకాశం లేదు. భాజపాకు మాత్రం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
2. రాజీనామాలు ఆమోదించకపోతే...
రాజీనామాలు ఆమోదించకపోతే.... 15 మంది రెబల్స్ శాసనసభకు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా... సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. అధికారంలో కొనసాగేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను పొందడంలో స్వామి సర్కారు విఫలమవుతుంది.