నిర్భయ సామూహిక అత్యాచార దోషులను.. ఉరితీసే అవకాశం ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌కు చెందిన పవన్ జల్లాడ్కు దక్కింది. 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులోని నలుగురు నిందితులను ఉరితీసేందుకు ప్రభుత్వం పవన్నే ఎందుకు ఎంచుకుంది? అసలు అతను ఎవరు? ఉరిశిక్ష అమలు చేసినందుకు అతనికిచ్చే పారితోషికం ఎంతనే విషయాలు మీకోసం..
పవనే ఎందుకు..?
నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవన్ జల్లాడ్ సరైన వ్యక్తిగా తిహార్ జైలు అధికారులు భావించారు. పవన్‌కు ఉరి తీసిన అనుభవం ఉంది. శారీరకంగా బలిష్ఠంగా ఉన్నాడు. అతని పూర్వీకులు కూడా తలారిలే కావటం వల్ల ఎలాంటి తప్పిదాలు జరగవన్న భావనతో అధికారులు పవన్‌వైపు మొగ్గుచూపారు. ఈ మేరకు తిహార్ అధికారులు అర్జీ పెట్టుకోగా ఉత్తర్‌ప్రదేశ్ జైళ్ల శాఖ అంగీకరించింది.
పారితోషికం ఎంత..?
ఉరివేస్తే తలారిలకు ప్రభుత్వం ఎంత పారితోషికం ఇస్తుందనే సందేహం సాధారణంగా ప్రతిఒక్కరిలో ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఒకరికి ఉరి వేస్తే రూ.25 వేలు చెల్లిస్తుంది ప్రభుత్వం. అంటే నిర్భయ దోషులకు నలుగురికి మరణశిక్ష అమలు చేస్తే పవన్‌కు లక్ష రూపాయలు పారితోషికంగా లభిస్తుంది.
పవన్‌కు అంగీకారమేనా?
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం రావాలని పవన్ జల్లాడ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. తలారిగా ఎంపికైన వెంటనే ఉత్తర్‌ప్రదేశ్ జైళ్ల శాఖకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.
జల్లాడ్ ఇంటిలో కొత్త వెలుగు!
తలారిగా విధులు నిర్వర్తిస్తున్నందుకు నెలకు రూ.5వేలు పవన్‌కు చెల్లిస్తుంది ఉత్తర్‌ప్రదేశ్ జైళ్ల శాఖ. అతనికి ఉన్న ఏకైక ఆదాయ మార్గం ఇదే. ప్రస్తుతం ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు జల్లాడ్. శిథిలావస్థకు చేరుకున్న మేరఠ్‌లోని తన ఇంటికి మరమ్మతులు చేయించే స్తోమత కూడా లేదని తెలుస్తోంది.