నల్లబియ్యం పండిస్తోన్న రైతు ఉపేంద్ర రకరకాల తెల్లబియ్యాన్ని వండుకుని తిన్న అనుభవం మనందరికీ ఉండే ఉంటుంది. నల్లటి బియ్యం తినడం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అయితే ఈ కథనం చూడాల్సిందే. ఈయన ఓ రైతు. అందరు అన్నదాతల్లా వ్యవసాయం చేసే వ్యక్తే. కానీ పండించే పంట మాత్రం ప్రత్యేకం. తన పొలంలో నల్లబియ్యం పండుతుంది మరి. నల్లబియ్యం పండించే సంప్రదాయ పద్ధతులు, వినూత్న చిట్కాలకు ఈయన పెట్టింది పేరు.
" 2016లో నాకు ఓ అంతర్జాతీయ పురస్కారం దక్కింది. గతేడాది అసోం నుంచి 15 మంది రైతులం వియత్నాం సందర్శించాం. అసోం ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, 13 మంది ఎమ్మెల్యేలు మాతోపాటు వియత్నాంకు వచ్చారు."
- ఉపేంద్ర, నల్లబియ్యం పండించే రైతు
2011లో కృషి విజ్ఞాన కేంద్రం ఉపేంద్రకు ఒక కేజీ బ్లాక్ రైస్ విత్తనాలు అందించింది. వాటిని వినియోగించి, మొదటి ఏడాదిలో 150 గ్రాముల నల్లబియ్యమే పండించగలిగాడు. అయినా నిరుత్సాహ పడకుండా... మరుసటి ఏడాది కూడా అదే పంట వేశాడు. 48 కిలోల నల్లబియ్యం పండించాడు. ప్రస్తుతం 800 ఎకరాల్లో బ్లాక్ రైస్ పండిస్తున్నాడు ఉపేంద్ర.
" నల్లబియ్యం నుంచి వివిధ ఉత్పత్తుల తయారీ ప్రారంభించాం. మొదట బ్లాక్‌రైస్ కేక్ తయారు చేశాం. అది చాలామందికి నచ్చింది. తర్వాత రైస్ కేక్స్, లడ్డూలు, మరమరాలు చేయడం మొదలు పెట్టాం. రైస్ బీర్ తయారీ ఇక్కడ సంప్రదాయం. నల్లబియ్యంతో కూడా రైస్ బీర్ తయారు చేస్తున్నాం. మామూలు బియ్యంతో చేసిన రైస్ బీర్ కంటే...బ్లాక్‌రైస్ బీర్ మరింత రుచికరంగా ఉంటుంది. నల్లబియ్యం కంటే...దానితో తయారు చేసిన ఉత్పత్తులకే ఎక్కువ గిరాకీ ఉంది."
- ఉపేంద్ర, నల్లబియ్యం పండించే రైతు
పోషక విలువల దృష్ట్యా పాశ్చాత్య దేశాల్లో నల్లబియ్యానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఉపేంద్ర, తోటి రైతులంతా మరింత నాణ్యమైన బియ్యం ఉత్పత్తి చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. బ్రౌన్ రైస్ కన్నా, ఎక్కువ పోషకాలు బ్లాక్‌రైస్‌లో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్లు ఎక్కువమొత్తంలో ఉండడం వల్ల, బరువు తగ్గడంలో సహాయపడతాయి. కొన్ని రకాల క్యాన్సర్లు దరిచేరకుండా కాపాడే నల్లబియ్యం... మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. చైనాలో పూర్వం నల్ల బియ్యాన్ని రాజరికానికి చిహ్నంగా భావించేవారు. రాజుల కుటుంబాల్లో మాత్రమే ఈ బియ్యాన్ని ఆహారంగా వాడేవారు. ఇంతటి చరిత్ర ఉన్న నల్లబియ్యాన్ని పండించడంలో రాణిస్తున్న ఉపేంద్ర పేరు మీదుగా.. బ్లాక్‌రైస్ పేరును ఉపేంద్ర రైస్‌గా మార్చింది వ్యవసాయ శాఖ. వ్యవసాయరంగంలో ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఉపేంద్ర.. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్నదాతలకు తన విజయగాథ ద్వారా స్ఫూర్తి నింపుతున్నాడు.
ఇదీ చూడండి: ఆటో డ్రైవర్‌గా మారిన డాక్టర్.. కారణమిదే...