ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు, నదీ ప్రవాహం సృష్టించిన విలయంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు నాలుగో రోజు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 174 మంది ఆచూకీ తెలియలేదు.
ముఖ్యంగా తపోవన్ విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న సుమారు 35 మందిని సురక్షితంగా వెలికితీసేందుకు సహాయ బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. సైన్యం, ఇంటో-టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) బలగాలు.. కాలంతో పోటీ పడి పనిచేస్తున్నాయి.
టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ పరికరాలను వాడుతున్నారు.
తపోవన్ వద్ద చినూక్ హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు నిర్వహించారు.
ఐటీబీపీ, ఆర్మీ, స్థానిక యంత్రాంగం అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై... సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: వరదలో కొట్టుకుపోయిన కార్మికులు
రెండున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగం నుంచి బయటకు వస్తున్న బురద.. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పరుస్తోంది. భారీ యంత్రాల ద్వారా బురదను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించారు. లోపల ఉన్న వారి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలను పంపినా.. అంతా చీకటిగా ఉండటం వల్ల పెద్దగా ఫలితం లేదు. మరోవైపు.. సొరంగంలో చిక్కుకుపోయిన తమవారి రాక కోసం కుటుంబసభ్యులు వేచి చూస్తున్నారు.