తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2019, 11:04 PM IST

Updated : Oct 2, 2019, 4:26 PM IST

ETV Bharat / bharat

సత్యం, అహింసలే ఆయుధాలుగా స్వేచ్ఛాసమరంలోకి..

స్వాతంత్ర్య సాధనకు సాయుధపోరాటమే మార్గమనే స్థాయికి విసిగి వేసారిన రోజులవి. అలాంటి సమయంలో.... సొంతగడ్డపై అడుగుపెట్టిన ఓ బక్క పల్చని మనిషి.. పరిస్థితులు సమూలంగా మార్చి మహాత్ముడిగా మారతాడని అప్పుడు ఎవరూ అనుకుని ఉండరు. కానీ ఆయనొచ్చారు. ప్రజల చేతుల్లో ఉన్న కత్తులను, తుపాకులను వారికి తెలియకుండానే తీసేసి.. వాటి స్థానే 2 కొత్త ఆయుధాలు అందించారు. సరికొత్త పోరాట ధోరణి ఫలాలను ప్రజలు మెల్లగా అర్థం చేసుకోసాగారు. మునుపెన్నడూ లేని విధంగా కదనరంగంలోకి బిరబిరా పరుగు తీశారు. హక్కులు సాధించుకున్నారు. సాధారణ వ్యక్తిగా వచ్చి జాతిపితగా అవతరించిన ఆయన... దేశానికి పరిచయం చేసిన ఆయుధాలే- సత్యం, అహింస.

సత్యం, అహింసలే ఆయుధాలుగా స్వేచ్ఛాసమరంలోకి..

సత్యం, అహింసలే ఆయుధాలుగా స్వేచ్ఛాసమరంలోకి..

దండెత్తి వచ్చేవాడికి దాసోహమనడం అలవాటు లేని భరతజాతి... స్వేచ్ఛాసమరంలో గాంధీజీ అడుగుపెట్టిన అనంతరం తన నినాదాన్ని మార్చుకుంది. 1857లో సిపాయిల తిరుగుబాటు నుంచి దాదాపు 6 దశాబ్దాల పాటు తూటాలదే మాట. సత్యాగ్రహ నినాదంతో... 'గాంధీ' అనే పేరుతో వీచిన నిశ్శబ్ద తుపాను... ఆ రక్తపు మరకలు, ప్రజల్లో నాటుకుపోయిన సాయుధ పోరాట వాదాన్ని చెరిపేసింది. 'అహింసో పరమో ధర్మః' అని విశ్వసించిన మహాత్ముడు... ఆ నినాదం తోనే.. రవి ఆస్తమించని రాజ్యమని విర్రవీగిన బ్రిటీషర్లకు పడమటి దారి చూపించాడు.

1857లో సిపాయిల తిరుగుబాటు అనంతరం... తెల్లవారిపై మంగళ్‌పాండే నేతృత్వంలో తొలిసారి భారీ ఎత్తున తిరుగుబాటు జరిగింది. వారందరిపై ఉక్కుపాదం మోపిన బ్రిటీష్‌సైన్యం.. తర్వాత అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిపై కాఠిన్యం ప్రదర్శించింది. బ్రిటీషర్ల తీరుతో స్వాతంత్ర్యోద్య మానికి సంఘీభావం తెలిపే సాహసం కూడా ఎవరు చేయలేకపోయారు. అదే సమయానికి దక్షిణాఫ్రికా గడ్డపై అహింసా పద్ధతిలో వర్ణవివక్షను ఎదిరించారు గాంధీ.

చంపారన్​తో మొదలు...

స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత గాంధీజీ చేపట్టిన తొలి సత్యాగ్రహం.. 1917 చంపారన్‌ఉద్యమం. నిజానికి అప్పటికి ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌లో అగ్రనాయకుడు కూడా కాదు. అయినా ఆయనను చంపారన్‌ బాట పట్టించింది దక్షిణాఫ్రికాలో బాపూ సాధించిన విజయాలే. నిరసనకు ఫలితంగా రైతులు కచ్చితంగా నీలిమందును పండించాలన్న ఆదేశాలు రద్దయ్యాయి. ఆ ఉద్యమం గురించి తన ఆత్మకథలో గాంధీజీ విశేషంగా పేర్కొన్నారు.

సత్యాగ్రహమనే పదం ఎక్కడ్నుంచి వచ్చిందో గాంధీజీ స్వయంగా తెలిపారు. దక్షిణాఫ్రికాలో చేపట్టిన ఈ తరహా ఉద్యమాన్ని పాసివ్‌ రెసిస్టెన్స్‌ అనే పేరుతో పిలిచేవారు. భారతీయులు తమ ఉద్యమానికి కొత్త పేరు పెట్టుకోవడం అనివార్యమని భావించినా... దానికి గాంధీజీ కూడా సరైన పేరు ఆలోచించలేకపోయారు.

'ఇండియన్‌ఓపినీయన్‌' అనే పత్రిక.. పేరు సూచించే అవకాశం పాఠకులకిచ్చింది. మంచి పేరు సూచించిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించింది. సత్యం, ఆగ్రహం అనే పదాలు కలిపి 'సదాగ్రహం' అనే పేరు సూచించిన మగన్‌లాల్‌గాంధీని అది వరించింది. ఈ పేరునే గాంధీజీ కాస్త మార్చి 'సత్యాగ్రహం'గా మార్చారు.

సత్యాగ్రహమే ఆయుధంగా సామాన్యులు సైతం...

క్రమంగా.. తుపాకీ చేతబట్టకుండానే ఆంగ్లేయులను ఎదిరించొచ్చని అర్థం చేసుకున్న సామాన్యులు సైతం సత్యాగ్రహాన్నే ఆయుధంగా మార్చుకున్నారు. చంపారన్‌సత్యగ్రహం తర్వాత బాపూజీ చేసిన ఖిలాఫత్‌ఉద్యమం...1857 ఉద్యమం తర్వాత ఆ స్థాయి జాతీయోద్యమంగా పేరు గాంచింది. సత్యాగ్రహ ఉద్యమక్రమంలో అరెస్టులకు వెరవని గాంధీజీని చూసి లక్షల మంది మహిళల్లో విశ్వాసం వేళ్లూనుకుంది. అప్పట్నుంచి 1942 వరకూ జరిగిన అనేక సత్యాగ్రహ ఉద్యమాల్లో వారు క్రియాశీల పాత్ర పోషించారు.

అన్ని వైషమ్యాలకు అతీతంగా ప్రజల్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు చేస్తున్న సత్యాగ్రహంలో పాల్గొనేవారికి క్రమశిక్షణ ఉండాలని భావించిన మహాత్ముడు.... యంగ్‌ఇండియా, హరిజన్‌, నవజీవన్ పత్రికలకు వ్యాసాలు రాసి ప్రజలకు అవగాహన కల్పించారు. 1920లో స్థాపించిన గుజరాత్‌విద్యాపీఠ్‌విశ్వవిద్యాలయాన్ని సత్యాగ్రహ శిక్షణా కేంద్రంగా మలిచారు. ఉద్యమాన్ని నడిపిన తీరు.. రాజకీయ ప్రత్యర్థుల్ని సైతం గాంధీజీకి స్నేహితులను చేసింది. బాపూ సత్యనిష్ఠ, అహింసా పోరాటం ప్రపంచవ్యాప్తంగా సామాజిక, రాజకీయ ఉద్యమకారులను ఉత్తేజితులను చేసింది.

లాలాలజపత్​రాయ్​ ఏమన్నారో తెలుసా...

సత్యాగ్రహంలో గాంధీజీకి ఎదురైన అసలైన సవాల్‌అహింస మార్గానికి ఆమోదం. దీనిపై పెద్ద ఎత్తున భిన్నవాదనలు, వాదోపవాదాలు వినిపించాయి. అతివాదులు, మితవాదులు సైతం స్థిర మైన అభిప్రాయం చెప్పలేదు. 1916 జులైలో కోల్​కతా కేంద్రంగా నడిచే 'మోడ్రన్‌రివ్యూ' మాస పత్రికలో లాలా లజపత్‌రాయ్‌... మహాత్ముడి 'అహింసో పరమో ధర్మః' సూత్రాన్ని ప్రశ్నించారు. అప్పుడు ఆయనేమన్నారంటే...

''గాంధీజీ వ్యక్తిత్వంపై పూజ్యభావమున్న నేను ఆయన ఉన్నత అభిప్రాయాలను ప్రశ్నించను. అహింసా సూత్రాన్ని మాత్రం వ్యతిరేకించడం నా విధిగా భావిస్తున్నాను. ఎంతటి మహాత్ముడైనా ఈ దేశ యువతను విషపూరితం చేసేందుకు ఒప్పుకోను. అహింసా సూత్రం ఓ వ్యక్తిని పిరికివాడిగా, ప్రజ్ఞాహీనులుగా తయారు చేసే ప్రమాదముంది. అహింసను పరమధర్మంగా భావిస్తే దేశ ఖ్యాతి, ధైర్యం, శౌర్యం తుడిచిపెట్టుకుపోతాయి. దేశభక్తి, జాతీయత, కుల గౌరవాలు మంటగలుస్తాయి. అనవసర సందర్భాల్లో అహింసా ప్రయోగం చేస్తే హిందువులు సామాజిక, రాజకీయ, నైతిక బలాలు కోల్పోతారు.''
- లాలా లజపత్​రాయ్​

లాలా లజపత్‌రాయ్‌వ్యాఖ్యలపై 1916 అక్టోబర్‌లో గాంధీజీ స్పందించారు.

''లాలాజీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తూనే అహింస వల్ల భారత ఖ్యాతి దెబ్బ తింటుందన్న మాట తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అహింస వల్ల మన ఖ్యాతి, బలం కోల్పోయాం అనడానికి చారిత్రక రుజువు, ప్రమాణాలు లేవు. 1500 ఏళ్లుగా మనం మన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించామనడానికి తగిన ఆధారాలున్నాయి. ఐతే దేశభక్తి కన్నా అంతఃకలహాలు, స్వార్థ ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. అహింసలో సత్యం, నిర్భయత్వం ముఖ్యమైన అంశాలు. అహింస పాటించాలంటే ఎనలేని ధైర్యం కావాలి. అందుకే... అహింస పిరికివారి ఆయుధం అనుకుంటే పొరపడినట్లే."
- మహాత్మగాంధీ

తన జీవితం ద్వారా ప్రపంచానికి విలువైన పాఠాలు నేర్పిన మహాత్ముడు... సత్యాగ్రహం, అహింసతో బానిస సంకెళ్లు తెంచుకోవచ్చనే విశ్వాసాన్ని కల్పించారు. కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారమయం చేస్తుందని నమ్మిన గాంధీజీ..'ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించు' అనే నినాదం వినిపించారు.

సత్యాగ్రహం, అహింస ద్వారా బానిస బంధనాల నుంచి విముక్తి కావాలన్న లక్షలమంది గళానికి బ్రిటీషర్లు తలొగ్గేలా చేశారు. చివరకు బ్రిటీషర్లు సైతం మెచ్చేలా సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించారు. చివరిగా... దేశానికి స్వాతంత్ర్యం ప్రసాదించడంలో సత్యం, అహింసకు అగ్రపీఠమేసిన బాపూ... ప్రజాస్వామ్య దేశంలో అంతటి విలువ ఓటు హక్కుకే ఉందని ప్రజలకు సూచించారు.

Last Updated : Oct 2, 2019, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details