తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యువత భయపడకండి.. మీ వెంట మేమున్నాం'

దేశ రాజధాని దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీలో గత రాత్రి జరిగిన దాడిని రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇదో భయానక ఘటనగా అభివర్ణించిన సోనియా.. యువత, విద్యార్థులకు కాంగ్రెస్​ పార్టీ మద్దతుగా ఉంటుందని అన్నారు. జేఎన్​యూలో హింస.. 26/11 ముంబయి దాడులను గుర్తుకుతెచ్చిందని అన్నారు మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ కూడా ఘటనను ఖండించారు.

the-voice-of-indias-youth-and-students-is-being-muzzled-everyday
'యువత భయపడకండి.. మీ వెంట మేమున్నాం'

By

Published : Jan 6, 2020, 3:00 PM IST

దిల్లీ జేఎన్​యూ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, ప్రొఫెసర్లపై జరిగిన దాడిని పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడిని అత్యంత భయానకమైనదిగా పేర్కొన్నారు.

భారత యువత, విద్యార్థుల గళాన్ని నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. జేఎన్​యూ ఘటనను ఖండించిన ఆమె.. మోదీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు జరగడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. అసమ్మతి స్వరాన్ని అణచివేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు. యువత, విద్యార్థులు భయపడవద్దని.. వారి వెంట కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

పవార్​ ఆగ్రహం..

దిల్లీ వర్సిటీలో దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​. పక్కా ప్రణాళికతోనే హింసాత్మక పరిస్థితుల్ని సృష్టించారని ఆరోపించారు.

జేఎన్​యూ ఘటనపై శరద్​పవార్​ ట్వీట్​

''జేఎన్​యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి పక్కా ప్రణాళికతో జరిగింది. ఈ విధ్వంసం, హింసతో కూడిని అప్రజాస్వామిక చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. హింస సృష్టించడం అంటే.. ప్రజాస్వామ్య విలువల్ని అణగదొక్కడమే. అయితే.. ఇది ఎప్పటికీ నెరవేరదు.''

- శరద్​ పవార్​ ట్వీట్​, ఎన్సీపీ అధినేత

26/1ను తలపించేలా..!

జేఎన్​యూలో హింసాత్మక ఘటనను తీవ్రంగా ఖండించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. 26/11 ముంబయి ఉగ్రదాడిని గుర్తుకుతెచ్చిందని పేర్కొన్నారు.

జేఎన్​యూ ఘటనపై ఉద్ధవ్​ విచారం

''దాడి చేసిన వారు ముసుగులు ధరించాల్సిన అవసరం ఏముంది. వారు పిరికిపందలు. నేను ఈ ఘటనా తీరును టీవీలో చూశా. 26/11 ముంబయి దాడిని గుర్తుకుతెచ్చింది. ఇలాంటి ఘటనల్ని నేను మహారాష్ట్రలో సహించను.''

- ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

ఈ దాడితో దేశంలోని విద్యార్థుల్లో అభద్రతా భావం నెలకొందని వ్యాఖ్యానించారు. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా కృషి చేయాలని అన్నారు. బాధ్యులను గుర్తించేందుకు దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేశారు.

మమత విచారం...

జేఎన్​యూ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. ఈ దాడిపై కలతచెందినట్లు తెలిపారు.

''దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. నేనూ.. విద్యార్థి దశలో రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపించేవారిని జాతి వ్యతిరేకులు లేదా పాకిస్థానీలుగా చూస్తున్నారు. భారత ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.''

- మమత బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details