విదేశీ వంటకాలను మనం లొట్టలేసుకుంటూ తినేస్తాం.. అది చూసి మన పిల్లలూ అదే మార్గంలో నడుస్తారు. భారతీయ వంటకాలు, పౌష్టిక ఆహారాన్ని వదిలి పాశ్చాత్య ఆహార పదార్థాలకు అలవాటు పడిపోయాక.. అవి ఆరోగ్యకరం కాదు మానేయండీ అంటే వింటారా? ఊహూ.. ప్రసక్తే లేదు. అందుకే, వారితో చెడు ఆహార అలవాట్లను మాన్పించి పోషకాహార విలువలు తెలియజేసేందుకు 'చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్'ను ఏర్పాటు చేసింది గుజరాత్ ప్రభుత్వం.
ప్రపంచంలోనే తొలిసారి...
ప్రపంచంలోనే ఎత్తయిన ఐక్యతా విగ్రహానికి అతి సమీపంలో.. నర్మద నదీ తీరాన కేవాడియాలో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది ఈ చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్కు. ఈ ఉద్యానవనంలో స్వదేశీ వంటకాల విలువలు తెలిపే త్రీడీ సినిమాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చెప్పే కార్టూన్లు.. ప్రకృతి విలువ తెలియజేసే నిర్మాణాలు.. వినూత్నమైన ఫుట్బాల్ కోర్ట్లు, కళ్లు మిరుమిట్లుగొలిపే లేజర్ షోలు.. ఒక్కటేమిటి అన్నీ పిల్లలను ఆకట్టుకునేవే.
ఇక్కడ ప్రతీ నిర్మాణం పోషకార ఆవశ్యకతను ఈ తరం బాలబాలికలకు అర్థమయ్యే రీతిలో తయారు చేశారు. ప్రపంచంలోనే ఇలా పిల్లల పోషకాహారానికి ఇంతలా ప్రాధాన్యత ఇస్తూ రూపుదిద్దుకున్న తొలి పార్కు ఇదే. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ పార్కు ఏర్పాటుపై ప్రత్యేక ఆసక్తి కనబరచారు.
పోషక రైలు..
ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందీ న్యూట్రీ రైలు. 600 మీటర్ల పొడవైన పట్టాలపై చక్కర్లు కొట్టే ఈ ట్రైన్ ఐదు స్టేషన్లలో ఆగుతుంది. ఒక్కో స్టేషన్లో ఒక్కో రకమైన పోషకాలను ఈ రైలు పరిచయం చేస్తోంది.