క్వారంటైన్ ముగియగానే తబ్లీగీ జమాత్ ప్రధాన నేత మౌలానా సాద్ ఖాందల్వి విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. సాద్ సహా ఏడుగురిపై దిల్లీ పోలీసు నేర విభాగం మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భౌతిక దూరం పాటించలేదని నిజాముద్దీన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు.
భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 91 ప్రకారం వివరాలు కోరుతూ దిల్లీ నేర విభాగం బుధవారం సాద్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం సాద్ క్వారంటైన్‌లో ఉన్నారని... 14 రోజుల గడువు పూర్తవ్వగానే విచారణకు హాజరవుతారని ఆయన తరఫున న్యాయవాది తౌసీఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మార్చి 21న మర్కజ్ నిర్వాహకులను పోలీసు అధికారులు సంప్రదించారు. రాజకీయ, మతపరమైన కార్యక్రమాలకు 50 కన్నా ఎక్కువమంది హాజరవ్వకుండా ప్రభుత్వం నిషేధం విధించిందని వివరించారు. అయినప్పటికీ పోలీసుల మాటను మర్కజ్ నిర్వాహకులు ఎవరూ లెక్కచేయలేదు. పైగా లాక్‌డౌన్‌ను ఎవరూ పాటించొద్దని, మర్కజ్ మత సమ్మేళనానికి హాజరు కావాలని అనుచరులకు సాద్ పిలుపునిచ్చిన అనుమానాస్పద ఆడియో ఒకటి మార్చి 21న వాట్సాప్‌లో వైరల్ కావడాన్ని గుర్తించారు.
ఆరోగ్య శాఖ, ప్రభుత్వ అధికారులకు భారీ జన సమ్మేళనం గురించి చెప్పకుండా వారు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారని పోలుసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కరోనా పరీక్షలు ఉచితంగా చేయండి: సుప్రీం