పుల్వామా ఉగ్రదాడి అనంతరం జమ్ము-కశ్మీర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు సంబంధించి కఠిన నిబంధనలు విధించింది ప్రభుత్వం. హైవేపై సాధారణ వాహనాలు వారానికి 2 రోజులు అంటే ప్రతి ఆది, బుధవారాల్లో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. మే 31 వరకు కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని గత వారమే గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.
ప్రస్తుతం వాహనాల నిషేధంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది. వారానికి 2 రోజుల పాటు వాహనాలను నిషేధిస్తే ప్రజలపై ప్రభావం పడుతుందని నాయకులు ఆరోపిస్తున్నారు. నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని దాదాపు అన్ని పార్టీలు, వ్యాపార సంఘాలు నిషేధాన్ని వ్యతిరేకించాయి. ఈ చర్య అప్రజాస్వామికమని, ప్రజావ్యతిరేక చర్య అని పేర్కొన్నాయి.
కోర్టును ఆశ్రయిస్తాం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. ప్రజలు నిషేధాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
"నిషేధం చాలా తప్పుడు చర్య. ఈ విధంగా కశ్మీర్‌ని అణచివేయలేరని ప్రభుత్వానికి చెబుతున్నా. ఇది మా రాష్ట్రం, ఇవి మా రోడ్లు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకునేందుకు మాకు హక్కు ఉంది. నిషేధం వల్ల విద్యార్థులు పడే ఇబ్బందులను చూశారు. నిషేధాన్ని అనుమతించొద్దని ప్రజలను కోరుతున్నా. తిరస్కరించి మీకు నచ్చినట్లు వెళ్లండి. నిషేధానికి వ్యతిరేకంగా మేము కోర్టును ఆశ్రయిస్తాం." - మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.