కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) స్కోరును రాష్ట్రాలు కూడా వినియోగించుకోవచ్చని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఫలితంగా నియామక సంస్థలకు ఖర్చులు, సమయం వృథా తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
సీఈటీ స్కోరును రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు అందిస్తామని అధికారిక ప్రకటనలో తెలిపారు.
"అభ్యర్థుల ఎంపిక కోసం జాతీయ నియామక సంస్థ నిర్వహించే సీఈటీ ఫలితాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పొందవచ్చు. ఈ స్కోరు ద్వారా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సంబంధిత సంస్థలు నియమించుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది."
- జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి