కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లల్లోని విద్యుత్ లైట్లు ఆర్పి ఐక్యతను చాటాలన్న ప్రధాని మోదీ పిలుపుతో బ్లాకౌట్ (అంధకారం)కు స్టేట్ లోడ్ డిస్పాచ్ కేంద్రాలు (ఎస్ఎల్డీసీ), విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థలు సమాయత్తమవుతున్నాయి. విద్యుత్ గ్రిడ్‌పై ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే దానిని పరిష్కరించేందుకు అనుసరించాల్సిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.
రాత్రి 9 గంటల ప్రాంతంలో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారిగా లోడ్ తగ్గిపోతే గ్రిడ్‌పై అధిక ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే.. ఈనెల 2న విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే 25 శాతం (125.81జీడబ్ల్యూ) మేర తగ్గిపోయింది.
అయితే.. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న కారణంగా గ్రిడ్ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని విద్యుత్ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
యూపీ ఎస్ఎల్డీసీ ఆదేశాలు..
విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోతే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ఉత్తరప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ కేంద్రం(ఎస్ఎల్డీసీ). రాష్ట్ర గ్రిడ్‌లోని అన్ని రియాక్టర్లను ఆన్‌లో ఉంచుతూ.. కెపాసిటర్ బ్యాంకును ఆఫ్ చేయాలని సూచించింది. రాత్రి 8-9 గంటల మధ్య లోడ్‌ను క్రమంగా తగ్గిస్తూ విద్యుత్ గ్రిడ్‌పై ప్రభావాన్ని తగ్గించాలని పేర్కొంది.
తమిళనాడులోనూ..
ఉత్తర్‌ప్రదేశ్ ఎస్ఎల్డీసీ చేసినటువంటి సూచనలే చేసింది తమిళనాడు ట్రాన్స్మిషన్ కార్పోరేషన్. ఆదివారం రాత్రి బ్లాకౌట్ సమయంలో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ఎస్ఎల్డీసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.