లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని సొంత తండ్రిపైనే కేసు పెట్టాడో తనయుడు. ఈ పని చేసిన దిల్లీ రజోకరీ ప్రాంతంలో నివసించే అభిషేక్ సింగ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకూ అతని తండ్రి ఏం చేశాడో తెలుసా.. ఇంట్లోంచి బయటకు వచ్చాడట. అవును మరి.
ఇంటి నుంచి బయటకు వచ్చాడని తండ్రిపైనే కేసు!
కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. భారత్ కూడా కాస్త ముందుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. అయినప్పటికీ నిబంధనలు ఏ మాత్రం లెక్కచేయని కొందరు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇదే విధంగా ఆంక్షల్ని ఉల్లంఘించిన సొంత తండ్రిపైనే తనయుడు కేసు పెట్టిన ఘటన దిల్లీ రజోకరీ ప్రాంతంలో జరిగింది.
కరోనా విజృంభణతో.. నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసింది మోదీ సర్కార్. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆదేశించింది. అయితే.. ఈ సూచనలను లెక్కచేయని అభిషేక్ తండ్రి అస్తమానం గడప దాటుతున్నాడట. 'సామాజిక దూరం' ప్రాధాన్యం తెలిసి.. కోపమొచ్చిన తనయుడు 100 నెంబరుకు ఫోన్ చేసి జరిగిన తతంగం చెప్పాడు. అనంతరం.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టాడు. అభిషేక్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతని తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మొదట అభిషేక్ చేసిన పనిని స్థానికులు విచిత్రంగా చూసినప్పటికీ.. ఇప్పుడు అభినందిస్తున్నారు. అతని కారణంగా.. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ ఎంత కీలకమో ప్రజల్లో అవగాహన ఏర్పడుతుందని అంటున్నారు.