నవరాత్రి ఉత్సవాల్లో సంప్రదాయ గార్బా నృత్యానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఉత్తరాదిన పురుడు పోసుకున్నా క్రమంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిందీ నాట్యం. తొమ్మిది రోజులు ఆదిపరాశక్తిని ఆనందపరిచే ఉద్దేశంతో అంతా కలిసి గార్బా ప్రత్యేక పాటలకు ఇష్టంగా నాట్యం చేయడం అనాథిగా వస్తున్న ఆచారం.
ఈ తరంవారు మాత్రం దేశమంతా ఆడుకునే గార్బాలో తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నారు. ఆ దుర్గా భవానీని వినూత్నంగా కొలవాలనుకుంటున్నారు. అందుకే సూరత్‌కు చెందిన మీనా మోదీ బృందం ఓ కొత్త ఆలోచన చేసింది. సంప్రదాయ నృత్యానికి ఆధునిక క్రీడను జోడించింది. కాళ్లకు స్కేటింగ్ షూస్ వేసుకుని అవలీలగా గార్బా ఆడుతూ ప్రశంసలు పొందుతోంది.