దేశ రాజధాని దిల్లీలో కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులను తక్షణమే దిల్లీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వీరితో పాటు కరోనా నియంత్రణ చర్యల్లో కేజ్రీవాల్ ప్రభుత్వానికి సాయం చేయడానికి కేంద్రం నుంచి మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులనూ పంపుతున్నట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో కలిసి దిల్లీలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన గంటల వ్యవధిలో ఈ నిర్ణయం తీసుకున్నారు షా.
" అండమాన్ నికోబార్ దీవుల్లో విధులు నిర్వర్తిస్తున్న అవానిష్ కుమార్, మోనికా ప్రియదర్శిని, అరుణాచల్ ప్రదేశ్‌లో పనిచేస్తున్న గౌరవ్ సింగ్ రావత్, విక్రమ్ సింగ్ మాలిక్‌ను తక్షణమే దిల్లీకి బదిలీ చేయాలని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వీరితో పాటు ఎస్సీఎల్ దాస్, ఎస్ఎస్ యాదవ్ అనే మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా కేజ్రీవాల్ సర్కారుకు తోడ్పాటు అందించేందుకు నియమించారు."