శత్రువును ఓడించేందుకు.. అహింసకు మించిన ఆయుధం లేదని మహాత్మా గాంధీ మనసా వాచా కర్మేణా నమ్మారు. రవి అస్తమించని సామ్రాజ్యమని విర్రవీగిన బ్రిటిష్ వాళ్లను ఎలాంటి ఆయుధం లేకుండా పరాజితులను చేసిన ధీరోదాత్తుడు.. గాంధీజీ.
స్టాలిన్ స్ఫూర్తితో హింసాత్మక పోరాటం చేసిన మావో తుత్సుంగ్, ఫిడేల్ క్యాస్ట్రో తమ దేశాలకు విదేశీ కబంధ హస్తాల నుంచి బంధ విముక్తి చేశారు. హింసకు ఏ మాత్రం తావులేకుండా మహాత్ముడు చేసిన సత్యాగ్రహ ఉద్యమం.. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్‌లకు ప్రేరణ ఇచ్చింది. ఇదే తమ ప్రజలకు బానిస బతుకుల నుంచి మోక్షం కల్పించింది.
భరతజాతి ఆత్మే ఆయుధంగా...
అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా గాంధీజీ చేసిన యుద్ధం సత్యాగ్రహం. పోరాటమంటే రక్తపాతం కాదని... రాజకీయ, సామాజిక వేదికల ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని ప్రపంచానికి కొత్తబాట చూపారు బాపూజీ. సత్యాగ్రహ ఉద్యమాన్ని నడిపేందుకు గాంధీజీ భారతజాతి ఆత్మనే ఆయుధంగా మలుచుకున్నారు. తొలుత చడీచప్పుడు లేని ఉద్యమంతో, ఆ పోరాట ఫలితాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఉద్యమ ఆచరణపై స్థిరవిశ్వాసం ఏర్పడేలా చేశారు. భయంతో బతికిన ప్రజలే.. క్విట్ ఇండియా అంటూ ఉప్పెనలా గర్జించే ధైర్యమిచ్చారు. సామ్రాజ్యవాద బ్రిటిష్ రాజ్యం మెడలు వంచారు.
తిరుగుబాటును అణచివేసినా...
1857లో తొలి భారత స్వాతంత్ర్య సమరం జరిగిన తర్వాత ఉద్యమం అంటే.. బ్రిటిషర్లపై దాడిగానే సాగేది. మంగళ్‌పాండే నేతృత్వంలో తొలిసారి భారీఎత్తున చేసిన తిరుగుబాటును బ్రిటిష్ సైన్యం ఉక్కుపాదంతో అణచివేసింది. ఇక ఏమాత్రం ఉపేక్షించినా ప్రమాదం తప్పదని గ్రహించి.. అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిపై కఠినంగా వ్యవహరించింది. మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను అరెస్టుచేసి, బహిష్కరించింది. చిట్టగాంగ్ తిరుగుబాటుదారుల ఆనవాళ్ళు లేకుండా చేసింది.
ఖుదిరామ్ బోస్‌లాంటి వ్యక్తులు అనుచరగణం లేకుండానే పోరాడారు. దేశ దాస్యశృంఖలాలు తెంచేందుకు ధైర్య సాహసాలు ప్రదర్శించిక తప్పదని భావించిన పౌరులు.. తిరుగుబాటే అసలైన త్యాగమని పోరాడేవారు. వీరికి సానుభూతి తెలపటమే కానీ.. రహదారులపైకి వచ్చి సంఘీభావం తెలిపే ధైర్యం చేయలేకపోయారు. బ్రిటిష్ సైన్యం తీరు వీరిని భయభ్రాంతులకు గురిచేసింది.
అలా మొదలైంది...
దేశంలో స్వాతంత్ర్యం పోరాటం హింసాత్మకంగా జరుగుతున్న సమయంలోనే.. గాంధీజీ దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. అహింసా పద్ధతిలో ఉద్యమం నడిపి విజయం సాధించారు. ప్రజల సామూహిక మద్దతు పొందేందుకు సత్యాగ్రహమే సమర్థవంతమైన వ్యూహమని గ్రహించారు మహాత్ముడు. 1915లో దేశానికి తిరిగివచ్చి లక్షలాది పురుషులు, మహిళల భాగస్వామ్యంతో.. సత్యాగ్రహ ఉద్యమం చేశారు. 1917లో బిహార్‌లోని చంపారన్‌లో మొదటిసారిగా సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. ఈ సత్యాగ్రహం ద్వారా అహింసాయుత ఉద్యమ ఫలితం తొలిసారి ప్రజలకు అర్థమైంది.
తుపాకి చేతబట్టకుండా శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడవచ్చని సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేశారు గాంధీ. చంపారన్ తర్వాత బాపూజీ... ఖిలాఫత్ ఉద్యమం చేశారు. మౌలానా సోదరులు షౌకత్, మహ్మద్ అలీ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. 1857లో భారత తొలి స్వతంత్ర పోరాటం మాదిరిగా హిందూ, ముస్లింలు కలిసి చేసిన ఖిలాఫత్ పోరాటం.. జాతీయోద్యమమైంది.
అహింసాయుత పోరు
సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్టులకు గాంధీజీ ఏమాత్రం బెదరలేదు. తనదైన శైలిలో.. అహింసాయుత పోరుబాట పట్టారు. పాతికేళ్ళకు పైగా సాగిన సత్యాగ్రహ ఉద్యమాల్లో మహిళలూ క్రియాశీల పాత్ర పోషించారు.
దేశంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల్ని ఏకం చేస్తున్న సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొనేవారికి ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండాలని మహాత్ముడు భావించారు. భావోద్వేగ పోరాటంలో ప్రజలు విచక్షణ కోల్పోతే హింస తప్పదని ఆందోళన చెందారు. అందుకే.. సత్యాగ్రహంపై యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్ పత్రికలకు ఉపన్యాసాలు, రచనలు రాసి ప్రజలకు అవగాహన కల్పించారు.
1920లో స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయాన్ని గాంధీజీ సత్యాగ్రహులకు శిక్షణా కేంద్రంగా మార్చారు. గాంధీజీ ఉద్యమాన్ని నడిపిన తీరుతో.. రాజకీయ ప్రత్యర్థులు, బ్రిటిష్ పాలకుల్ని సైతం స్నేహితులను చేసింది. బాపూజీ సత్యనిష్ఠ, అహింసా పోరాటం దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, రాజకీయ ఉద్యమకారులను ఉత్తేజితం చేసింది. దేశ, విదేశాలకు చెందిన లక్షలాది మంది అనుయాయుల్ని సంపాదించేలా చేసింది. దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సమరయోధుడు నెల్సన్ మండేలా, అమెరికా హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్.. మహాత్ముని స్ఫూర్తితోనే అహింసాయుత యుద్ధం చేసి విజయం సాధించారు.
ప్రకృతి పాఠాలు...
గాంధీజీ తన జీవితం ద్వారా ప్రపంచానికి విలువైన పాఠాలు నేర్పారు. సత్యాగ్రహం, అహింసతో బానిస సంకెళ్ళు తెంచుకోవచ్చని నమ్మకం కల్పించారు. సరళమైన జీవనం, ప్రకృతి జీవితం, పర్యావరణంతో స్నేహం చేసినప్పుడే భవిష్యత్‌కి భరోసా అనే భావన కలిగించారు.
గాంధీజీ స్వాతంత్ర్య సమరం చేసేనాటికి.. ప్రపంచం కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం అనే రెండు పరస్పర వ్యతిరేక భావజాలాల మధ్య విభజించబడింది. వీటికి భిన్నంగా.. సమాజ ఆధారిత సహకార హిందీ స్వరాజ్ ఆలోచనతో పోరాటం చేశారు. విజయం సాధించారు మహాత్ముడు. కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారం చేస్తుందని సత్యాగ్రహంతో మహాత్ముడు అలుపెరగని పోరాటం చేశారు.
మన అభిప్రాయాలను బలవంతంగా ఇతరులపై రుద్దితే నిజమైన స్వాతంత్ర్యం సాధించలేమని గాంధీజీ విశ్వసించారు. బానిస బంధనాల నుంచి విముక్తి కావాలన్న లక్షలాది దేశ ప్రజల గొంతుకను బ్రిటిషర్లు ఆలకించేలా చేశారు. సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆంగ్లేయులు సైతం మెచ్చేలా నిర్వహించారు బాపూజీ. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. స్వాతంత్ర్యోద్యమంలో.. సత్యాగ్రహ ఉద్యమానికి అగ్రపీఠమేసిన మహాత్ముడు.. ప్రజాస్వామ్య దేశంలో అంతటి విలువ ఓటు హక్కుకే ఉందని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి:గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ