భారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వరదలు అదుపులోకి వచ్చినా ఆగస్టులో అవి సృష్టించిన విధ్వంసాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ రోగిని చికిత్సకు తీసుకువెళ్లేందుకు కనీస రోడ్డు మార్గం లేక 25 కి.మీ జోలిలో మోసుకెళ్లాల్సి వచ్చింది.
ఇడుక్కి జిల్లాలోని ఎడమలక్కుడిలో ఆగస్టు 8న కురిసిన భారీ వర్షాలకు ఈ గ్రామం నుంచి పెట్టిముడి దాకా రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఆ మార్గంలో అంబులెన్స్ వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి చేర్చేందుకు 50 మంది గ్రామస్థులు ఏకమయ్యారు.