'వాయు వెళ్లాడు... వరుణుడు గేర్ మారుస్తాడు' గుజరాత్‌ను వణికించిన వాయు తుపాను తీవ్రత తగ్గటం వల్ల నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో చురుకుగా మారి మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది.
వాయు తుపాను వల్ల రుతుపవనాల కదలికల్లో మందగమనం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌కు విస్తరించాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా మహారాష్ట్రకే రాలేదని పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది ఐఎండీ. మధ్య భారత్‌లోని చాలాప్రాంతాలు, ఉత్తర, దక్షిణ తీరం, ఈశాన్యం, ఉత్తర బంగాల్, సిక్కింకు 2-3 రోజుల్లో రుతుపవనాలు విస్తరించనున్నట్లు ప్రకటించింది.
43 శాతం లోటు
దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 43 శాతానికి చేరినట్లు వెల్లడించింది ఐఎండీ. మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలను చూసే ఐఎండీ కేంద్ర డివిజన్ రికార్డు స్థాయిలో 59 శాతం లోటు వర్షపాతం ఉంటుందని తెలిపింది. తూర్పు, ఈశాన్య భారతంలో 47 శాతంగా ఉందని పేర్కొంది.