ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర ఘటన బాధితులను కలిసే అంశమై జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సోన్‌భద్రలో జరిగిన భూవివాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని చునార్ అతిథి గృహానికి తరలించారు. అక్కడా ప్రియాంక ధర్నాకు దిగారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై దేశానికి తెలిపేందుకే యూపీకి వచ్చానని ఉద్ఘాటించారు ప్రియాంక. ఘటన జరిగిన గ్రామానికి వెళ్లకుండా ఉండాలని జిల్లా పాలనాధికారి, ఎస్పీలు ప్రియాంకకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి వెనక్కి వెళ్లాలని సూచించారు. కానీ అందుకు ప్రియాంక తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ తీసుకోవడం అనైతికమని వ్యాఖ్యానించారు.
'అరెస్ట్ చేసి 9గంటలు అయింది'
తనను నిరంతరం పోలీసులు వెంబడించడంపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు ప్రియాంక. తనను అరెస్ట్ చేసి తొమ్మిది గంటలయిందని పోస్ట్ చేశారు.
'బాధిత కుటుంబాలను కలవడం నేరమా?'
బాధిత కుటుంబాలను కలవడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు ప్రియాంక. ఒక్కరుగానే వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలని అనుకుంటున్నట్లు ముందే వెల్లడించానని స్పష్టం చేశారు.