కరోనా వేళ.. దేశ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విధానాన్ని సమీక్షించనున్నారు ప్రధాని. మే 17తో లాక్డౌన్ గడువు తీరనున్న నేపథ్యంలో.. తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలు, అవలంబించాల్సిన విధానాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు స్వీకరించనున్నారు.
లాక్డౌన్ ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం వంటి వ్యూహాలపైనా సీఎంలతో చర్చించనున్నట్లు సమాచారం.
ఈ సారి భేటీకి కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా హాజరవనున్నట్లు తెలుస్తోంది. గత సమావేశంలో కొంతమంది సీఎంలకే మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రధాని.. ఈసారి అందరినీ మాట్లాడాలని కోరినట్లు సమాచారం.